
మెగాస్టార్ చిరంజీవి అంటేనే ఒక బ్రాండ్. ఆయన సినిమా వస్తుందని తెలిస్తేనే అభిమానులు పండగ చేసుకుంటారు. చిరంజీవి సినిమా అంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ద్వారా మళ్లీ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న మెగాస్టార్, ఇప్పుడు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా తరువాత చిరంజీవి చేతిలో మరో రెండు ప్రాజెక్టులు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. వాటిలో ఒకటి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఉండగా, మరొకటి అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కనుంది. ఇటీవల ‘లైలా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి స్వయంగా అనిల్ రావిపూడి సినిమా గురించి స్పష్టత ఇచ్చారు. సాహు గారపాటి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కబోతుందని ప్రకటించారు. అనిల్ రావిపూడి కథ చెప్పిన ప్రతిసారి కడుపు పట్టుకుని నవ్వుతూనే ఉన్నానని, చాలా కాలం తర్వాత పూర్తి స్థాయి కామెడీ మూవీ చేయబోతున్నానని చిరు తెలిపారు.
అనిల్ రావిపూడి కామెడీ ఫిల్మ్స్ అంటే ప్రేక్షకులకు ఎంతలా నచ్చుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటివరకు దాదాపు 250 కోట్ల వరకు వసూళ్లు అందుకుందని సమాచారం. ఈ నేపథ్యంలో సినిమా టీం విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, హరీశ్ శంకర్, వంశీ పైడిపల్లి గెస్టులుగా హాజరయ్యారు.
ఈ వేడుకలో రాఘవేంద్రరావు మాట్లాడుతూ, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ఇండస్ట్రీకి పెద్ద ఫెస్టివల్ తీసుకొచ్చిందని ప్రశంసించారు. చాలా రోజుల తర్వాత ఓ సినిమాకు ఇంత ఆదరణ లభించడం ఆనందంగా ఉందని, ఈ చిత్రానికి వెంకటేశ్ తో పాటు హీరోయిన్‌లు ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షీ చౌదరి కూడా ప్రాముఖ్యమైన ప్లస్ పాయింట్స్ గా నిలిచారని అన్నారు. భీమ్స్ అందించిన సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణగా మారిందని పేర్కొన్నారు.
అలాగే, అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేయబోతుండటంపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమా కోసం ఎదురుచూస్తున్నానని, ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాకు ‘సంక్రాంతి అల్లుడు’ అనే టైటిల్ సరిగ్గా సరిపోతుందని సూచించారు. ప్రస్తుతం రాఘవేంద్రరావు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
2026 సంక్రాంతికి చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమా విడుదల కావచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. చిరంజీవి పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌లో నటించబోతుండటంతో అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. సంక్రాంతి సీజన్‌కు చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబో పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ ను అందించబోతుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.