కళాకారులకు తరతమ బేధాలు లేవు. వచ్చిన ఆఫర్‌ను నచ్చినట్లు ఉంటే వెంటనే ఓకే చెప్పేస్తారు. ముఖ్యంగా తమ మాతృభాషా చిత్రాలలో స్టార్ స్టేటస్ ఉన్న వారు ఇతర భాషల్లో నటించటానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇందుకు కొన్ని కథలు వారిని ఆకట్టుకుంటే.. మరికొన్ని ఫ్రెండ్షిప్ కొద్దీ ఒప్పుకునేవి ఉంటాయి. తాజాగా చిరంజీవి ఓ బాలీవుడ్ మూవీలో నటించనున్నారు. గతంలో చిరంజీవి నటించిన చాలా సినిమాలు హిందీలోకి డబ్ అయి ఉత్తరాధి ప్రేక్షకులను అరించాయి.
అర్జున్ నటించిన సంచలన చిత్రం ‘జెంటిల్మెన్’ను చిరంజీవి హీరోగా ‘ది జెంటిల్మెన్’గా రీమేక్ చేశారు. ఆ తర్వాత చిరంజీవి నటించిన ప్రతి చిత్రం హిందీలో డబ్ అవుతూనే ఉంటుంది. అయితే ప్రస్తుతం చిరంజీవి చేయబోయే బాలీవుడ్ సినిమా మాత్రం మెయిన్ హీరోగా కాదు. ఓ ముఖ్యమైన పాత్రకు చిరంజీవే సూటబుల్ ఆర్టిస్ట్ అని ఆయన్ను సంప్రదించారట దర్శక, నిర్మాతలు.
మెగా కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న వార్తలను బట్టి ఇండియన్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ఈ ఎపిసోడ్ వెనుక ఉన్నారట. చాలా కాలoగా చిరంజీవికి, అమితాబ్‌కు మంచి స్నేహం ఉంది. ఈ కారణంగానే ఇటీవల చిరంజీవి ‘సైరా’ మూవీలో తన గురువు పాత్రకు అమితాబ్‌ను అడగగానే ఆయన వెంటనే ఒప్పుకుని చేశారు. సినిమా ఫలితం నిరాశపరిచినా వారి స్నేహం మాత్రం చెదిరిపోలేదు. అందుకే అమితాబ్ ఆబ్లిగేషన్ మీద చిరంజీవి ఈ బాలీవుడ్ చిత్రాన్ని చేయటానికి ఒప్పుకున్నారట.
చిరంజీవితో పాటు నాగార్జునకు కూడా అమితాబ్‌తో మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ కలిసి గతంలో ‘ఖుదాగవా’ అనే సూపర్‌హిట్ చిత్రంలో నటించారు. అలాగే అక్కినేని కుటుంబానికి, అభిమానులకు మెమరబుల్ మూవీ అయిన ‘మనం’లో కూడా అమితాబ్ నాగార్జున రిక్వెస్ట్ మీద నటించారు. చిరంజీవి తాజా బాలీవుడ్ సినిమాకు సంబంధించి ఇతర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.