Wednesday, September 22, 2021

చిరు పక్కన ఆమె ఫైనల్‌ అయిందట

మెగాస్టార్‌ చిరంజీవి సరసన నటించాలని ఏ హీరోయిన్‌కు మాత్రం ఉండదు. చిరంజీవి నటించిన ‘ఖైదీ’ విడుదల తర్వాత నుంచి నేటి వరకూ తెలుగు తెరమీదకు వచ్చిన ప్రతి హీరోయిన్‌ చిరు సరసన నటించటానికి ఉవ్విళ్లూరుతూనే ఉంటారనేది నిజం. అప్‌కమింగ్‌ హీరోయిన్‌లే కాదు.. స్టార్‌ హీరోయిన్‌లు సైతం చిరు సరసన అంటే తమ పాత్ర నిడివి తక్కువ ఉన్నా ఎగిరి గంతేసి ఒప్పేసుకుంటారు. తాజాగా ఇట్లాంటి అవకాశమే దక్షిణాది స్టార్‌ హీరోయిన్‌ నయనతారకు వచ్చింది.

మెగాస్టార్‌ ప్రస్తుతం ‘ఆచార్య’తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి నటించబోయే చిత్రం మలయాళ రీమేక్‌ ‘లుసీఫర్‌’. కొద్ది నెలలుగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ నడుస్తూనే ఉంది. ఇందులో హీరోయిన్‌ పాత్రకు సంబంధించి వారానికి ఒక పేరు మీడియాలో ప్రముఖంగా వినిపిస్తూ వస్తున్నాయి. తాజాగా వార్త ప్రకారం నయనతార పేరు ఫైనల్‌ అయినట్లు తెలుస్తోంది.

తెలుగు రీమేక్‌లో హీరో, హీరోయిన్‌కు ఓ పాటను కూడా పెట్టనున్నారట. మలయాళంలో సంచలన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించడానికి యూనిట్‌ అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది.
మోహన్‌ రాజా దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌వర్క్‌ను పకడ్బంధీగా పూర్తి చేస్తున్నారు.

పలు విజయవంతమైన చిత్రాలకు మాటలు రాసిన ఆకుల శివ ఈ చిత్రానికి మాటల రచయితగా పనిచేస్తున్నారు. అలాగే సాయి మాధవ్‌ బుర్రా సైతం స్క్రిప్ట్‌వర్క్‌లో భాగం పంచుకుంటున్నారు. ‘ఆచార్య’ పూర్తవగానే ‘లుసిఫర్‌’ సెట్స్‌ మీదకు వస్తారు మెగాస్టార్‌. మెగాస్టార్‌ సరసన నయనతార తొలి సారిగా నటిస్తుండడంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Latest Articles