2024 తమిళ సినీ పరిశ్రమకు కష్టాల సంవత్సరం అని చెప్పొచ్చు.సినీ పరిశ్రమ విజయవంతంగా ఉండాలంటే వరుసగా హిట్ సినిమాలు రావాలి. సంవత్సరానికి వందల సినిమాలు రిలీజైతే కనీసం 20-30 శాతం సినిమాలు సక్సెస్ అవ్వాలి. కానీ తమిళ ఇండస్ట్రీలో ఈ శాతం క్రమంగా పడిపోతూ వచ్చింది. ముఖ్యంగా 2024లో కోలీవుడ్ చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంది. టాలీవుడ్ పరిస్థితి కాస్త బాగుందని అనిపించినా కోలీవుడ్ మాత్రం భారీ నష్టాలను మూటగట్టుకుంది.
2024లో వచ్చిన పెద్ద సినిమాల్లో కొన్ని భారీ అంచనాలు ఉన్నా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ముఖ్యంగా సూర్య నటించిన ‘కంగువ’, కమల్ హాసన్ ‘భారతీయుడు 2’ సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి. రజినీకాంత్ ‘వేట్టయ్యన్’ సినిమా కాస్త బెటర్ అనిపించినా పెద్ద హిట్ కాదు. విజయ్ ‘గోట్’ సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. భారీ బడ్జెట్ సినిమాలు ఈ విధంగా నిరాశపరిచిన నేపథ్యంలో పరిశ్రమలో ఆర్థిక ఒత్తిడులు పెరిగాయి.
2024లో కోలీవుడ్ నుంచి 241 సినిమాలు విడుదలయ్యాయి. కానీ హిట్ చిత్రాల సంఖ్య కేవలం 18 మాత్రమే. మొత్తం సినిమాలకు దాదాపు 3000 కోట్లకు పైగా వ్యయం చేయగా, దాదాపు 1000 కోట్లకు పైగా నష్టం నమోదయింది. ఈ ఏడాది విడుదలైన 150 సినిమాలకు కూడా కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా రాబట్టలేకపోయాయని తెలుస్తోంది. పరిశ్రమ మీద ఈ నష్టాలు ప్రభావం చూపి కొత్త ప్రాజెక్టులు ఆలస్యం కావడానికి కారణమయ్యాయి.
స్టార్ హీరోల సినిమాలు ఫ్లాప్ అవ్వగా, కొంత మేరకు చిన్న సినిమాలు మంచి విజయం సాధించాయి. ముఖ్యంగా ‘గరుడన్’, ‘డిమోంటీ కాలనీ 2′, ‘వాజై’, ‘లబ్బర్ పందు’ వంటి సినిమాలు సక్సెస్ అందుకున్నాయి. అయితే, ఈ విజయాలు పరిశ్రమ మొత్తం కోలుకోవడానికి సరిపోవు. మరోవైపు ఇతర భాషా సినిమాలు కోలీవుడ్ బాక్సాఫీస్‌పై పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి.
2024లో తమిళ పరిశ్రమ భారీ నష్టాన్ని మూటగట్టుకున్నా, 2025లో వచ్చే సినిమాలపైనే ఇప్పుడు భారీ ఆశలు పెట్టుకున్నారు. రాబోయే సినిమాలు పరిశ్రమను తిరిగి నిలబెడతాయా? లేక ఇంకా నష్టాలు మిగిల్చేలా ఉంటాయా? అనే ప్రశ్న ప్రేక్షకులను, నిర్మాతలను కలవరపెడుతోంది.