గత సంవత్సరం తెలుగు చిత్ర పరిశ్రమ నుండి వచ్చిన బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన ‘లక్కీ భాస్కర్’ గురించి ప్రస్తుతం ఒక వివాదం చెలరేగుతోంది. ఈ చిత్రం కంటెంట్ పరంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది, మంచి వసూళ్లు కూడా సాధించింది. అయితే, బాలీవుడ్ సీనియర్ దర్శకుడు హన్సల్ మెహతా ఈ సినిమాపై కాపీ ఆరోపణలు చేశారు. ఆయన మాటల్లో, తాను తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘స్కామ్ 1992’ కాన్సెప్ట్‌ను తీసుకొని ఈ సినిమా నిర్మించారని పేర్కొన్నారు.
సినిమా విడుదలైనప్పుడు ఈ ఆరోపణలు చేయని హన్సల్, ఇప్పుడు ఇది ప్రస్తావించడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. దీనికి నేపథ్యం లేకపోలేదని చెప్పవచ్చు. ‘లక్కీ భాస్కర్’ నిర్మాత నాగవంశీ ఇటీవల టాలీవుడ్ సినిమాల విజయాల గురించి మాట్లాడుతూ, బాలీవుడ్‌పై విమర్శలు చేసినట్లు తెలిసింది. ఆయన వ్యాఖ్యానంలో, “‘పుష్ప-2’ ఒక్కరోజులో రూ.86 కోట్ల వసూళ్లు సాధించడం చూసి బాలీవుడ్ వాళ్లకు నిద్ర పట్టి ఉండదేమో” అనే మాటలు వున్నాయి.
ఈ వ్యాఖ్యలపై హన్సల్ మెహతా స్పందిస్తూ, తాను బాలీవుడ్ వాడినే, ముంబయిలోనే ఉంటానని, కానీ బాగానే నిద్రపోతున్నానని సెటైరిక్‌గా ట్వీట్ చేశారు. ఆ తర్వాత నాగవంశీని ప్రస్తావిస్తూ ‘లక్కీ భాస్కర్’ సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమా తమ ‘స్కామ్ 1992’ సిరీస్ కాన్సెప్ట్ ఆధారంగా తీసినట్లే ఉందని, అయితే దీనిపై ఆయనకు పెద్ద అభ్యంతరమేమీ లేదని పేర్కొన్నారు.
హన్సల్ .. సినిమా అనేది అన్ని పరిశ్రమల మధ్య జరిగే కాన్సెప్ట్ కాబట్టి.. ఎక్కడైనా.. ఏ భాషలో అయినా సక్సెస్ అవ్వడం వల్ల వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అన్నట్లుగా మాట్లాడారు. అంతేకాదు ఇలా అన్ని భాషల్లో సక్సెస్ సాధించడం వల్ల అందరికీ లాభం జరుగుతుందని అన్నారు. కానీ, ఎవరు ఎవరి కంటే గొప్పవారని మాట్లాడడం తగదని, ఇలాంటి అహంకారం పనికి రాదని హెచ్చరించారు. తనకు ఛాలెంజ్ విసురుతున్నవారికి, 2025లో దాన్ని నిరూపించుకోవచ్చని కూడా సూచించారు.
ఈ వివాదం ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ మధ్య కొత్త చర్చలకు కారణమవుతోంది. ఒకవైపు ‘లక్కీ భాస్కర్’ విజయాన్ని పొగుడుతూ, మరోవైపు హన్సల్ చేసిన ఆరోపణలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. ఏదేమైనా, ఇలాంటి చర్చలు రెండు పరిశ్రమల మధ్య వైరం కాకుండా, పాజిటివ్ సమన్వయానికి దోహదం చేయాలని సినీ ప్రేమికులు భావిస్తున్నారు.