
ప్రస్తుతం తెలుగు సినిమాలు నార్త్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రామ్ నటించిన సినిమాలు హిందీ డబ్బింగ్ లో భారీగా వ్యూస్ రాబడుతున్నాయి. ఆయనకి ఉత్తరాదిలో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో రామ్”డబుల్ ఇస్మార్ట్” అతి తక్కువ సమయంలోనే 100 మిలియన్ వ్యూస్ దాటేసి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఇది వాస్తవానికి అనూహ్యమైన ఘటన. ఎందుకంటే మొదటి భాగమైన ”ఇస్మార్ట్ శంకర్” నాలుగు సంవత్సరాల క్రితం యూట్యూబ్ లో పెడితే ఇప్పటిదాకా 386 మిలియన్ వ్యూస్ అందుకుంది. కానీ డబుల్ ఇస్మార్ట్ చాలా వేగంగా వ్యూస్ పెంచుకుంటూ పోతుంది. ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాదిలోనే 500 మిలియన్ల మార్క్ దాటేయొచ్చు.
ఇది కొత్త విషయం కాదు. మన ఊర మాస్ తెలుగు సినిమాలకు ఉత్తరాదిలో ఎప్పటి నుంచో మంచి ఆదరణ ఉంది. రామ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నితిన్ లాంటి హీరోల సినిమాలకు అక్కడ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వారియర్, స్కంద లాంటి సినిమాలు సైతం మూడు వందల మిలియన్ వ్యూస్ దాటాయి. కానీ రామ్ కి చెందిన ”హలో గురు ప్రేమ కోసమే” 584 మిలియన్ వ్యూస్ తో అగ్రస్థానంలో ఉంది.
డబుల్ ఇస్మార్ట్ ఈ స్థాయిలో వ్యూస్ అందుకోవడానికి కారణాల్లో బాలీవుడ్ నటీనటుల ప్రభావం కూడా ఉంది. ఇందులో సంజయ్ దత్ విలన్ గా నటించడమే కాకుండా, మరికొందరు ప్రముఖ హిందీ నటులు కూడా నటించారు. ఇది ఉత్తరాదిలోని ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అయ్యేలా చేసింది.
ఈ ట్రెండ్ ని బట్టి ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. మాస్ ఎంటర్ టైన్మెంట్ కి అక్కడి ప్రేక్షకులు ఎంతగానో ఆకర్షితులు అవుతున్నారు. అందుకే అక్కడ పుష్ప 2 లాంటి సినిమాలు ఎనిమిది వందల కోట్ల వసూళ్లతో అద్భుత విజయాన్ని సాధించాయి. సరైన కంటెంట్ తో మన సినిమాలు ఉత్తరాదిలో భారీ వసూళ్లు రాబట్టగలవు.
అక్కడి దర్శకులు అందించలేకపోతున్న మాస్ కమర్షియల్ సినిమాలను మన తెలుగు డైరెక్టర్లు అద్భుతంగా రూపొందిస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ లో కొంత లోపాలు లేకపోయి ఉంటే థియేటర్లలోనూ పెద్ద విజయాన్ని సాధించేదని అభిమానులు అంటున్నారు. పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు తమ వింటేజ్ ఫిలిం మేకర్ వైభవాన్ని మళ్లీ చూపిస్తే ”పోకిరి” లాంటి బ్లాక్ బస్టర్స్ రావొచ్చు.
భవిష్యత్తులో మన తెలుగు సినిమా నార్త్ మార్కెట్ లో మరింతగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. కచ్చితంగా మంచి కంటెంట్ తో సినిమాలు తీస్తే, అక్కడ మన సినిమాలకు అమితమైన ఆదరణ లభించనుంది.