ఇతర భాషలలో రూపొందిన సినిమాలు తెలుగులో డబ్బింగ్ రూపంలో విడుదలై అద్భుతమైన విజయాలను సాధించడం కొత్త విషయం కాదు. ముఖ్యంగా తమిళ్, కన్నడ, మలయాళ సినిమాలు తెలుగులో పెద్ద విజయాలు సాధించాయి. కమల్ హాసన్, రజినీకాంత్, సూర్య, విజయ్, కార్తీ వంటి స్టార్ హీరోలకు తెలుగులో గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి డబ్బింగ్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
తమిళ హీరో విజయ్ ఆంటోనీ, బిచ్చగాడు సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అలాగే శివ కార్తికేయన్ అమరన్ సినిమాతో తెలుగులో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. ఈ రెండు సినిమాలు డబ్బింగ్ చిత్రాలుగా మాత్రమే కాకుండా భారీ వసూళ్లను అందుకోవడంలో విజయం సాధించాయి.
కన్నడలో రాకింగ్ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ సిరీస్ తెలుగు ప్రేక్షకుల నాడిని గట్టిగా తాకింది. ఈ సిరీస్ కేవలం బాక్సాఫీస్ వద్దనే కాకుండా యష్‌కు తెలుగులో స్టార్ ఇమేజ్ను తెచ్చిపెట్టింది. మరోవైపు మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌కు తెలుగులో మంచి అభిమానులు ఉన్నారు. అలాగే దుల్కర్ సల్మాన్ తన తెలుగు సినిమాలతో ఇక్కడ కూడా స్టార్ ఇమేజ్ను పెంచుకుంటున్నారు.
తెలుగులో అత్యధిక లాభాలను అందుకున్న ఇతర భాషల చిత్రాల జాబితాలో మొదటి స్థానంలో రజినీకాంత్ జైలర్ సినిమా ఉంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 12 కోట్లకు కొనుగోలు చేయగా, 35.90 కోట్ల ప్రాఫిట్ అందుకుంది. రెండవ స్థానంలో యష్ కేజీఎఫ్ చాప్టర్ 2 ఉంది. దీని తెలుగు రైట్స్ 50 కోట్లకు కొనుగోలు చేయగా, 34.25 కోట్ల లాభాన్ని అందించింది. మరో భారీ విజయం కాంతారా. గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని కేవలం 2 కోట్లకు కొనుగోలు చేసి, 27.65 కోట్ల ప్రాఫిట్ సాధించింది.
ఈ ఏడాది శివ కార్తికేయన్ నటించిన అమరన్ కూడా తెలుగులో అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. కేవలం 5 కోట్లతో తెలుగు రైట్స్ కొనుగోలు చేసిన ఈ చిత్రం 23 కోట్ల లాభాన్ని అందించింది. ఇక బిచ్చగాడు సినిమా 50 లక్షలతో కొనుగోలు చేసి 16.30 కోట్ల లాభాన్ని అందించింది. తమిళ్, కన్నడ, మలయాళ చిత్రాలు తెలుగులో భారీ విజయాలను అందుకోవడమే కాకుండా ఈ భాషా ప్రేక్షకులతో అనుబంధాన్ని బలపరుస్తున్నాయి.