తీరిక లేని ఒత్తిడితో కూడుకున్న జీవన విధానం, తగినంత వ్యాయామం లేకపోవడం, పోషకాహారానికి కూడా దూరమవడం వంటివి గుండె జబ్బులకు దారి తీస్తుంది. వంట వండుకునే తీరిక లేకపోవడంతో ప్రస్తుతం చాలా మంది ఫాస్ట్ ఫుట్, జంక్ ఫుడ్ కు అలవాటు పడుతున్నారు. పీజ్జాలు, బర్గర్లు తింటూ కాలం నెట్టుకస్తున్నారు.
దీంతో చాలా రోగాలు పొంచి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటితో గుండె జబ్బలు వచ్చే అవకాశం మెండుగా ఉంటుందని కూడా సూచనలు చేస్తున్నారు. అయితే గుండె జబ్బులు వచ్చిన తర్వాత మందులు వాడడం, జీవన శైలిలో మార్పులు చేయాల్సిందే. హృదయ సంబంధిత వ్యాధులు రాకుండా, వచ్చినా కంట్రోల్ లో ఉండేందుకు యోగాలో మహనీయులు కొన్ని ఆసనాలను సూచించారు.
క్రమం తప్పకుండా కొన్ని ఆసనాలు వేస్తే హృదయ సంబంధ రోగాలు దరి చేరవని యోగా మాస్టర్లు వివరిస్తున్నారు. జబ్బులు వచ్చిన తర్వాత చేయడం మేలే.. కానీ రాకముందు చేస్తే మంచి ప్రయోజనం కలుగుతుంది. దీంతో ఎక్కువ కాలం జీవించేందుకు ఆస్కారం ఉంటుందంటున్నారు యోగా నిపుణులు. హృదయానికి (గుండెకు) మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆసనాలను సూచిస్తున్నారు వాటిని ఇప్పుడు ఇక్కడ చూద్దాం.
తాడాసనం
మొదట నిటారుగా నిల్చోవాలి. రెండు చేతులని పైకి లేపాలి. శరీరాన్ని బాగా సాగదీస్తూ రెండు అరచేతులను సూర్యుడివైపునకు ఉంచాలి. ఇలా 10 సెకండ్ల పాటు నిలబడాలి. తర్వాత మామూలు స్థితికి రావాలి. ఇలా 3 నుంచి 5 సార్లు చేస్తే గుండెకు మంచిది. దీంతో పాటు కీళ్లకు కూడా మంచిది.
అధోముఖ స్వనాసనం
ముందుకు వంగుతూ రెండు చేతులను నేలకు తాకించాలి. ‘V’ ఆకారంలో మాదిరిగా. నడుము మధ్య భాగం ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. పక్క చిత్రంలో సూచించిన విధంగా కొన్ని సెకన్ల పాటు ఉండాలి. ఇది రోజులో 8 నుంచి 10 సార్లు చేయాలి.
భుజంగాసనం.
చదరపు నేలపై దుప్పటి లేదా యోగా మ్యాట్ వేసుకోవాలి. దానిపై బోర్లా పడుకొని రెండు చేతులు నేలకు ఆనించి నడుము వరకూ పైకి ఎత్తాలి. ఇలా 30 సెకన్ల పాటు ఉండాలి. తర్వాత మెల్లగా సాధారణ స్థితికి రావాలి. రోజుకు 3-4 సార్లు చేయవచ్చు.
సేతు బంధాసన
ఇందులో వెల్లకిలా పడుకోవాలి. నడుము భాగాన్ని పైకి లేపాలి. మోకాలు నుంచి కింది వరకూ కాళ్లను సపోర్ట్ గా తీసుకోవాలి. చేతులను చాచి కాళ్లను పట్టుకుంటే సరిపోతుంది. ఇలా 10 సెకండ్ల పాటు ఉండాలి. రోజులో 4 నుంచి 5 సార్లు చేయవచ్చు.
అమృత ఆసనం(శవాసనం)
శవాసనంను అమృత ఆసనంగా పిలుస్తారు. దీనికి ఇటీవల ఈ పేరును సూచించారు యోగా నిపుణులు. చదరపు నేలపై మ్యాట్ లేదా చెద్దరి వేసుకొని వెల్లకిలా పడుకోవాలి. చేతులు కాళ్లను ఫ్రీగా పెట్టుకోవాలి. కదలకుండా 20 సెకండ్ల పాటు ఉండాలి.
పశ్చిమోత్తాసనం
కింద కూర్చొని రెండు కాళ్లను నిటారుగా చాచాలి. పాదాలను తలవైపునకు వంచాలి. తలను క్రమంగా కిందికి వంచాలి. చేతులతో కాళ్ల బొటన వేళ్లు పట్టుకుంటే సపోర్టు దొరుకుతుంది. ఇలా 10 నుంచి 20 సెకండ్ల పాటు ఉండాలి. ఇలా రోజులో రెండు సార్లు చేయవచ్చు.