గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ ప్రాజెక్ట్ అన్ని ఏరియాల్లో దాదాపు పూర్తయింది. ఈ సినిమా బయ్యర్లు మంచి ఫ్యాన్సీ ధరలకు కొనుగోలు చేశారు. మొదట ఈ చిత్రంపై పెద్దగా హైప్ లేకపోయినా, ట్రైలర్ విడుదల అనంతరం అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా ఈ సినిమాలో దర్శకుడు శంకర్ మార్క్ ఉన్న కథ, కథనాలు ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇండస్ట్రీలో కూడా ఈ సినిమా పై పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. మొదటి రోజే ఈ చిత్రం భారీ కలెక్షన్లు రాబడుతుందని భావిస్తున్నారు. మెగా ఫ్యాన్స్ అయితే సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగా హీరోల సినిమాలకు నైజాం ఏరియాలో మంచి క్రేజ్ ఉంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సినిమాలకు ఇక్కడ భారీగా ఆదరణ లభిస్తుంది.
ఈ నేపథ్యంలో ‘గేమ్ చేంజర్’ కూడా నైజాంలో మంచి వసూళ్లు సాధిస్తుందని భావిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, నైజాంలో ఈ సినిమా రూ. 43.50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఇది రామ్ చరణ్ కెరీర్లోనే సొలోగా హైయెస్ట్ థియేట్రికల్ బిజినెస్. ఇంతకుముందు రామ్ చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు రూ. 70 కోట్ల రేంజ్లో బిజినెస్ జరిగిన సంగతి తెలిసిందే. అలాగే చిరంజీవితో కలిసి రామ్ చరణ్ నటించిన ‘ఆచార్య’ సినిమాకు రూ. 38.50 కోట్ల బిజినెస్ జరిగింది.
‘వినయ విధేయ రామ’ చిత్రానికి రూ. 24 కోట్ల బిజినెస్ జరిగింది, కానీ ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో బయ్యర్లకు నష్టాలు వచ్చాయి. అయితే ఈ సారి మాత్రం ‘గేమ్ చేంజర్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ను చాలా ఈజీగా క్రాస్ చేస్తుందని భావిస్తున్నారు. టికెట్ ధరలు పెరగడంతో పాటు, ప్రీమియర్ షోలు కూడా ఉండే అవకాశం ఉంది. ప్రీమియర్ షోలపై స్పష్టత రాకపోయినా, అదనపు షోలు పెంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వొచ్చని అంటున్నారు.
సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే, నైజాంలో కలెక్షన్లకు బ్రేక్ ఉండదని మేకర్స్ ధీమాగా ఉన్నారు. ముఖ్యంగా అభిమానులు చాలా రోజులుగా పెద్ద హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ‘గేమ్ చేంజర్’పై ఉన్న హైప్ కారణంగా మొదటి రోజు ఓపెనింగ్స్ భారీగానే ఉండే అవకాశం ఉంది. లాంగ్ రన్ వసూళ్లు మాత్రం సినిమా టాక్పై ఆధారపడి ఉంటాయి.
ఇక ఇటీవల ‘పుష్ప 2’ నైజాంలో రూ. 100 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. మరి ‘గేమ్ చేంజర్’ ఆ స్థాయి కలెక్షన్లు సాధిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది.