హరీష్‌ ‘అన్నపూర్ణ’ నుంచి ఎందుకు వచ్చేశాడు

0
736

మనకున్న కమర్షియల్‌ డైరెక్టర్స్‌లో హరీష్‌ శంకర్‌ కూడా ఒకరు. తాజాగా ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గద్దలకొండ గణేష్‌’. ఈ సినిమాలో వరుణ్‌తేజ్‌ హీరోగా, ఆయన సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించింది. ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫర్వాలేదు అనిపించుకుంది. ‘గద్దలకొండ గణేష్‌’గా వరుణ్‌తేజ్‌ మంచి నెగెటివ్‌ క్యారెక్టర్‌ చేశాడని పరిశ్రమతో పాటు ప్రేక్షకుల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హరీష్‌ శంకర్‌ పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఒక ఆసక్తికరమైన విషయాన్ని మీడియాతో పంచుకున్నారు. ప్రారంభంలో తాను సహాయ దర్శకుడు కావడానికి పడ్డ బాధను గూర్చి పంచుకున్నారు.

దర్శకుడు కావాలనే కలతోనే పరిశ్రమలోకి అడుగుపెట్టా. ఓ దర్శకుడి దగ్గర దాదాపు 2 సంవత్సరాలు పనిచేశా. ఆయనకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వంటి అన్ని విషయాల్లోనూ చాలా సహాయంగా ఉండేవాడిని. ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమా అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభం అయ్యింది. షూటింగ్‌ ప్రారంభ కవరేజ్‌లో నా పేరు కూడా పేపర్‌లో వస్తుంది అనుకున్నా. కానీ తెల్లవారి చూస్తే పత్రికల్లో నాపేరు కనపడలేదు. ఇదే విషయం ఆ దర్శకుడిని అడిగా. ఆయన పక్కకు తీసుకువెళ్లి ఏవేవో చెప్పుకొచ్చాడు. పత్రికల్లో ఏం రావాలో మన చేతుల్లో ఏమీ ఉండదు. పైగా అసిస్టెంట్‌ పేర్లు వారు రాయరు.

కేవల0 మెయిన్‌ ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ పేర్లు మాత్రమే రాస్తారు అన్నారు. కానీ నాకు మాత్రం నా పేరు పేపర్‌లో కనపడకపోవడం, పైగా అసిస్టెంట్‌ పేర్లు పేపర్స్‌లో రావు అని చెప్పడంతో ఏడుపు ఆగలేదు. అలా అన్నపూర్ణ స్టూడియో నుంచి ఏడుస్తూ బయటకు వచ్చేశా. అప్పుడు అనుకున్నా ఎలాగైనా సరే నేను దర్శకుణ్ణి అయ్యి తీరానే కసిని మరింత పెంచుకున్నా. ఆరోజు పేపర్‌లో నా పేరు రాకపోవడం అనే పాయింట్‌ ఈరోజు ఇంతమంది జర్నలిస్ట్‌లు నా ఇంటర్వ్యూ కవరేజ్‌కు రావడానికి కారణమైందేమో అంటూ పేర్కొన్నారు. హరీష్‌లాగా చాలామంది అసిస్టెంట్‌లు తమ పేర్లు పేపర్‌లో చూసుకోవాని తెగ ఆరాట పడుతుంటారు. కానీ మెయిన్‌ టీంకు తప్ప మిగిలిన వారికి అటు దినపత్రికతో పాటు ఇటు వార పత్రికల్లో కూడా చోటు ఉండదు.