
రాజ్ తరుణ్ గత ఏడాది పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. లావణ్య అనే యువతి అతడిపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. తనతో కొన్నేళ్ల పాటు సహజీవనం చేశాడని, పెళ్లి చేసుకున్నాక మరో హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో సంబంధం పెట్టుకున్నాడని లావణ్య ఆరోపించింది. దీంతో రాజ్‌పై కేసులు కూడా నమోదయ్యాయి.
ఈ వివాదం కొన్ని నెలల పాటు మీడియా హాట్ టాపిక్‌గా మారింది. లావణ్య తరఫున జనసేన మాజీ నేత, లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకర కోర్టులో కేసు వాదించారు. మీడియా వేదికగా రాజ్, లావణ్య పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. లావణ్య ప్రత్యేకంగా టీవీ చానెళ్లలో, యూట్యూబ్ ఇంటర్వ్యూలలో రాజ్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. వీటివల్ల రాజ్ తరుణ్ వ్యక్తిగత జీవితం, కెరీర్ తీవ్రంగా దెబ్బతిన్నాయి.
కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. లావణ్యతో సంబంధం ఉన్న యూట్యూబర్ మస్తాన్ సాయి ఇటీవల అరెస్టయ్యాడు. అతని దగ్గర వందలాది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో లావణ్య కూడా అతని బాధితురాలేనని కొత్త కథ బయటకొచ్చింది. మరోవైపు, లావణ్య ఒక పోలీసు అధికారితో కూడా సన్నిహితంగా ఉందని, వారిద్దరి మధ్య వీడియో కాల్స్ గురించి కొన్ని వివరాలు లీక్ కావడంతో మరింత సంచలనం రేగింది.
దీంతో లావణ్య గత ఆరోపణలపై ప్రజల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ఆమె మీడియా ముందుకు వచ్చి, రాజ్ తరుణ్ అమాయకుడని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మస్తాన్ సాయిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి, తనపై నెపం మోపేందుకు తాను నాటకమే ఆడానని చెప్పడం మరింత చర్చనీయాంశమైంది.
లావణ్య రాజ్ తరుణ్‌కి క్షమాపణ చెప్పడమే కాక, అవసరమైతే అతడి కాళ్లు పట్టుకునేందుకు సిద్ధమని చెప్పడం వైరల్‌గా మారింది. అయితే ఇన్నాళ్లూ ఆమె చేసిన ఆరోపణలు, పెట్టిన కేసుల వల్ల రాజ్ ఎంత ఇబ్బంది పడ్డాడో అందరికీ తెలిసిందే. ఆ ఆరోపణల ఆధారంగా మీడియా కూడా అతడిపై తీవ్రంగా దాడి చేసింది. కానీ ఇప్పుడు లావణ్య తన మాట మార్చేసి క్షమాపణ చెప్పడం చాలిస్తుందా?
తప్పుడు ఆరోపణలు చేసి, అవాస్తవ కేసులు పెట్టి రాజ్ తరుణ్ జీవితాన్ని ఇబ్బందులకు గురిచేసినందుకు లావణ్యపై పోలీసులు ఏదైనా చర్య తీసుకుంటారా అన్నది ప్రశ్నగా మారింది. ఆమె నిజంగానే బాధితురాలా? లేక ఇది మరొక కొత్త నాటకమా? అనేది ఇప్పటికీ స్పష్టత లేదు. రాజ్ తరుణ్ జీవితంలో ఈ వివాదం ఎంతగానో ప్రభావం చూపింది. ఇప్పటికైనా అతనికి న్యాయం జరుగుతుందా? లేదా ఈ వ్యవహారం ఇంతటితో ముగిసిపోతుందా అన్నది వేచిచూడాలి.