
తమిళ సినీ నటుడు విజయ్ తన చివరి సినిమాగా ప్రకటించిన “జన నాయకన్” పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజకీయ రంగప్రవేశానికి ముందు విజయ్ ఎలాంటి సినిమా చేస్తారా అనే ఉత్కంఠ అభిమానుల్లో ఎక్కువైంది. చివరికి ఆయన హెచ్. వినోద్ దర్శకత్వంలో ఈ సినిమాను చేపట్టారు. వినోద్ ఇప్పటివరకు యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు మాత్రమే తెరకెక్కించినప్పటికీ, తొలిసారి రాజకీయ నేపథ్యంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ అంశం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.
విజయ్ గతంలో పొలిటికల్ టచ్ ఉన్న కొన్ని సినిమాలు చేసినా, పూర్తిస్థాయిలో రాజకీయ నాయకుడిగా కనిపించే సినిమా చేయలేదు. కానీ, ప్రస్తుత పరిస్థితులు ఆయనను ఇలా మారాల్సిన అవసరం తెచ్చాయి. ప్రజా నాయకుడిగా సినిమా చేయడం ఆయన రాజకీయ భవిష్యత్తుకు అనుకూలంగా ఉండొచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ అంచనాలతోనే “జన నాయకన్”పై భారీ హైప్ ఏర్పడింది. సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉండగానే, ప్రీ-రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతోంది. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు ఏకంగా రూ.75 కోట్లకు అమ్ముడైనట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా ఈ చిత్రం రూ.400 కోట్ల వరకు బిజినెస్ చేయగలదని అంచనా వేస్తున్నారు.
విజయ్ గత సినిమాలను పరిశీలిస్తే ఆయన మార్కెట్ రేంజ్ స్పష్టంగా తెలుస్తుంది. “గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్” చిత్రం తెలుగులో విజయం సాధించకపోయినా, ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. అంతకుముందు వచ్చిన “లియో” టాలీవుడ్లో యావరేజ్‌గా నిలిచినా, ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అలాగే “బీస్ట్”, “బిగిల్”, “మాస్టర్”, “సర్కార్”, “మెర్సల్” వంటి సినిమాలు విజయ్ కెరీర్లో బ్లాక్బస్టర్లుగా నిలిచాయి. “వారిసు” కూడా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, విజయ్ మార్కెట్‌ను మరోసారి నిరూపించింది. ఈ హిట్ ట్రాక్ రికార్డ్ కారణంగానే “జన నాయకన్”కు భారీ బిజినెస్ జరుగుతున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. సినిమా బడ్జెట్ రూ.300 కోట్లుగా నిర్ణయించబడింది. విజయ్ తన చివరి చిత్రంగా ప్రకటించడంతో, అభిమానుల అంచనాలు రెట్టింపయ్యాయి. సినిమా రాజకీయ నేపథ్యంలో ఉన్నప్పటికీ, కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయని సమాచారం. విజయ్, హెచ్. వినోద్ కాంబినేషన్, ఈ ప్రత్యేకమైన కాన్సెప్ట్, భారీ బడ్జెట్ ఇలా అన్ని కూడా “జన నాయకన్” మూవీ పై హైప్ పెంచుతున్నాయి.