
మెగాస్టార్ చిరంజీవి తన గత చిత్రం ‘భోళా శంకర్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశను మూటగట్టుకున్నాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాకపోవడంతో, కథల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం అతడు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ‘విశ్వంభర’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.
ఇదొక సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కుతోంది. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల మే నెలకు వాయిదా పడింది. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కావాల్సి ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్‌తో ఈ సినిమాను అద్భుతంగా మలచాలని టీమ్ భావిస్తోంది. వీఎఫ్ఎక్స్ పనుల కోసం భారీ ఖర్చు చేస్తూ, ప్రతీ ఫ్రేమ్‌ను ఆకర్షణీయంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మే నెలలోనూ సినిమా రిలీజ్ అయ్యేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక ఈ సినిమాకు హిందీ మార్కెట్లో భారీ బిజినెస్ జరిగింది. బాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ మూవీ హిందీ డబ్బింగ్ రైట్స్‌ను రూ.38 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. చిరంజీవికి ఉత్తరాది మార్కెట్లోనూ మంచి ఫాలోయింగ్ ఉండటం వల్ల, ఈ సినిమా హిందీలోనూ మంచి ఆదరణ పొందుతుందని టాక్. దీంతో, హిందీ వెర్షన్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా బాలీవుడ్లో రూ.50 కోట్లకు పైగా కలెక్షన్లు రాబడుతుందనే నమ్మకంతో హిందీ రైట్స్ కోసం భారీ మొత్తాన్ని చెల్లించినట్లు తెలుస్తోంది.
వశిష్ఠ గతంలో ‘బింబిసార’ సినిమాతో కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. ఈ అనుభవంతో ‘విశ్వంభర’ను కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కిస్తున్నాడు. చిరంజీవి గతంలో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ వంటి చిత్రాలతో సోషియో ఫాంటసీ జానర్లో సక్సెస్ సాధించాడు. ఈ నేపథ్యలో ‘విశ్వంభర’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకోగా, ఇంకా కొన్ని వీఎఫ్ఎక్స్ పనులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, త్వరలోనే మూవీ రిలీజ్‌పై క్లారిటీ వచ్చే అవకాశముంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా, చిరంజీవి కెరీర్లో కీలకంగా మారనుంది. ‘విశ్వంభర’ హిట్ అయితే, చిరంజీవి మళ్లీ ఫుల్ ఫాంలోకి వస్తాడు. చూడాలి మరి ఈ సినిమా ఎంతవరకు మెప్పిస్తుందో!