గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఓటమితో వైసిపి శ్రేణులు డీలా పడిన సంగతి తెలిసింది. వైసిపి కలలో కూడా ఊహించని ఫలితాలు రావడంతో వైసిపి శ్రేణులు గత కొన్నాళ్లుగా నిరాశ నిస్పృహలో కూరుకుపోయారు, పార్టీకి తగిలిన దెబ్బతో ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదని భావించారు. అయితే డీలా పడిన నేతలు, కార్యకర్తలకి ఎట్టకేలకి జగన్ ఊపు తెప్పించాడని చెప్పవచ్చు.
అసెంబ్లీకి జగన్ రాదని భావించినా అనూహ్యంగా తన బలగంతో అసెంబ్లీకి రావడంతో కొత్త ఆశలు రేపారు. అంతే కాకుండా అసెంబ్లీ ఎదుట పోలీసులతో వాగ్వాదం పడిన తీరుతో వైసిపిలో నూతన ఉత్సాహం వచ్చింది. తాము తీసుకొచ్చిన ప్లకార్డులను తీసుకెళ్తుండటంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతే కాదు ఆ పెనుగులాటలో ప్లకార్డ్స్ చినిగిపోవడంతో జగన్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.
ప్లకార్డులను హక్కు ఎవరిచ్చారని పోలీసులని నిలదీశారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, అధికారం ఏ పార్టీకి శాశ్వతం కాదని జగన్ మండిపడ్డారు. ప్లకార్డులను ఆపాలని ఎవరు ఆదేశించారని ప్రశ్నించారు. పోలీసులు తీరు దారుణంగా ఉందని, చట్ట ప్రకారం పోలీసులు నడుచుకోవాలని హెచ్చరించారు. నల్ల కండువాలతో నిజమైన ప్రతిపక్ష పాత్ర జగన్ పోషిస్తున్నారని వైసిపి శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.