ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రస్తుతం తీవ్ర వివాదాలలో చిక్కుకొని ఉన్నారు. అతనిపై లైంగిక దాడి, బలవంతపు వివాహం, మత మార్పిడికి సంబంధించిన అనేక ఆరోపణలపై కేసు నమోదైంది. ఇందులో బాధితురాలు అతని దగ్గర పని చేసిన లేడీ అసిస్టెంట్ కావడం, ఇవి జరిగిన సమయంలో ఆమె మైనర్ గా ఉండడం తో జానీపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 40 రోజుల రిమాండ్ అనంతరం, కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
తాజాగా పోలీసులు ఈ కేసుకు సంబంధించిన చార్జీషీట్ దాఖలు చేయడం కలకలం రేపింది. దీనిపై జానీ మాస్టర్ స్పందిస్తూ, తనపై వచ్చిన ఆరోపణలన్నీ తప్పుడు అభియోగాలేనని, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు. “ఏం జరిగింది అనేది నాకు, నా అంతరాత్మకు, ఆ దేవుడికి మాత్రమే తెలుసు. కోర్టు లో నిజం తేలుతుందనుకుంటున్నాను. నేను క్లీన్ చీట్తో బయటకు వస్తానని నమ్ముతున్నా,” అంటూ ఓ వీడియోలో చెప్పారు.
ఈ కేసులో హీరో అల్లు అర్జున్ పేరు ప్రస్తావనకు రావడం మరింత చర్చనీయాంశమైంది. జానీ మాస్టర్ అరెస్టుకు అల్లు అర్జున్ కారణమా? అనే మీడియా ప్రశ్నకు జానీ స్పందించకుండా వెళ్లిపోయారు. కానీ, అల్లు అర్జున్ను కలిశారా? అనే ప్రశ్నకు, తనకు ఇప్పుడంత సమయం లేదని, కుటుంబంతో ఉండడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నానని తెలిపారు.
బెయిల్ తర్వాత జానీ మాస్టర్ తన పనిని తిరిగి ప్రారంభించే ప్రయత్నాలు చేస్తున్నారు. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన శ్రీతేజ్ అనే వ్యక్తిని పరామర్శించడమే కాకుండా, డ్యాన్సర్ అసోసియేషన్ తరఫున ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు.
జానీ మాస్టర్ కేసులో పోలీసుల చార్జీషీట్ దాఖలు నేపథ్యంలో న్యాయస్థానం ఏమి నిర్ణయం తీసుకుంటుందో అన్న విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. కోర్టులో కేసు విచారణ అనంతరం ఆయనకు న్యాయం దక్కుతుందా, లేక కేసు మరింత బలపడుతుందా అన్నది వేచిచూడాల్సి ఉంది.