అప్పుడు చెప్పాడు.. చేసి చూపించాడు..అదే తారక్ స్పెషాలిటీ

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌ గురించి చెప్పాలి అంటే.. రెండు భాగాలుగా చెప్పొచ్చు. టెంపర్ సినిమా వరకు, టెంపర్ సినిమా తర్వాత. టెంపర్ సినిమా రావడానికి ముందు ఎన్టీఆర్ వరుసగా ఫ్లాపులతో ఇబ్బంది పడ్డాడు. కథల ఎంపికలో, దర్శకుల ఎంపికలో జరిగిన తప్పిదాల వల్ల ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి.

కంత్రి, శక్తి, రామయ్యా వస్తావయ్యా, దమ్ము, రభస లాంటి సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. కెరీర్ ప్రారంభంలోనే సింహాద్రి లాంటి ఇండస్ట్రీ హిట్ అందుకున్న హీరోకు వరుస ఫ్లాపులు రావడంతో అభిమానులు నిరాశ చెందారు. అలాంటి క్లిష్టమైన సమయంలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో టెంపర్ సినిమా చేసి ఎన్టీఆర్ తిరిగి విజయపథంలోకి వచ్చాడు.

టెంపర్ సినిమా కేవలం ఎన్టీఆర్ కెరీర్‌నే కాకుండా, దర్శకుడు పూరీ జగన్నాథ్ కెరీర్‌ను కూడా మాంచి హైప్ ఇచ్చింది. ఆడియో లాంచ్‌లో ఎన్టీఆర్ “ఇక నుంచి నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా సినిమాలు చేస్తాను. హిట్, ఫ్లాప్ గురించి ఆలోచించను. నా సినిమాలు చూసి అభిమానులు గర్వపడేలా చూసుకుంటాను” అని చెప్పాడు. ఈ మాటలు చెప్పిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్ ఒక్క ఫ్లాప్‌ను కూడా చూడలేదు.

టెంపర్ తర్వాత వచ్చిన నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీరరాఘవ అన్నీ భారీ విజయాలను సాధించాయి. ఇక రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఎన్టీఆర్‌ను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది.

గత ఏడాది వచ్చిన దేవర సినిమా కూడా మంచి కలెక్షన్లు సాధించి విజయవంతమైంది. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ వార్ 2లో నటించనున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. అలాగే కొరటాల శివ దర్శకత్వంలో దేవర 2 చేయనున్నాడు.

టెంపర్ ఆడియో లాంచ్‌లో ఎన్టీఆర్ చెప్పిన మాటలు కేవలం అభిమానులను సంతోషపరిచేందుకు చెప్పినవే కాదని గత పదేళ్లలో ఆయన చూపించిన ప్రగతి నిరూపిస్తుంది. అభిమానులు ఏ స్థాయిలో అయితే తనను చూడాలనుకున్నారు, ఆ స్థాయికి మించి ఎదుగుతూ, తన కెరీర్‌ను కొత్త ఎత్తులకు తీసుకెళ్లాడు.