ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా విడుదల సమయంలో, క్యాన్సర్‌తో బాధపడుతున్న ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన చివరి కోరికగా దేవర సినిమాను చూడాలని కోరుతూ తల్లిని వేడుకుంటున్న వీడియోలు చూసిన ఎన్టీఆర్, వెంటనే స్పందించి పెద్ద మనసుతో కౌశిక్‌కి తోడ్పాటు అందించారు. స్వయంగా వీడియో కాల్లో మాట్లాడటంతో పాటు, ఆసుపత్రి ఖర్చులన్నీ తానే భరిస్తానని హామీ ఇచ్చారు.
అయితే దేవర సినిమా విడుదల తరువాత ఈ విషయంపై పెద్దగా చర్చ లేకుండా పోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కౌశిక్ తల్లి, మీడియా ముందు ఎన్టీఆర్ హామీ ఇచ్చి తరువాత స్పందించడం లేదని విమర్శలు చేస్తూ, ఇంకా పెద్ద మొత్తంలో బిల్లు చెల్లించాల్సి ఉందని చెప్పడం చర్చనీయాంశమైంది. ఈ విషయం ఎన్టీఆర్ వరకు చేరడంతో, గంటల వ్యవధిలోనే అతడి ఆసుపత్రి ఖర్చులన్నీ చెల్లించి, కౌశిక్‌ను డిశ్చార్జ్ చేయించేలా చేశారు.
తాజాగా కౌశిక్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడంతో, ఆయన తల్లి మీడియా ముందుకు వచ్చి ఎన్టీఆర్‌కి ధన్యవాదాలు తెలిపారు. తాను ఎక్కడా ఎన్టీఆర్‌పై తప్పుగా మాట్లాడలేదని, తప్పుగా అర్థం చేసుకున్నారని స్పష్టం చేశారు. తన కొడుకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతుండటంపై ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సంఘటన ఎన్టీఆర్ అభిమానులను మాత్రమే కాకుండా, సామాన్యుల హృదయాలను కూడా తాకింది. ఆయన పెద్ద మనసుతో చేయి అందించడం, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఎన్టీఆర్ వంటి నటులు తమ అభిమానులను ఇష్టపడే దశలోనే కాకుండా, వారికి అవసరమైన సమయంలో సాయం చేయడంలో ముందుండడం నిజంగా ప్రశంసనీయమైంది.
ఈ సంఘటన తర్వాత ‘దేవర’ సినిమా ప్రమోషన్ మరింత పుంజుకుంది. ఎన్టీఆర్ మంచి హృదయం, అభిమానులపై చూపిన ప్రేమ ఈ సినిమాకు మరింత పాజిటివ్ బజ్‌ను తెచ్చిపెట్టింది. ఇలాంటి సంఘటనలు మాత్రమే కాకుండా, ఎన్టీఆర్ నిజ జీవితంలో చూపే మంచితనం ఆయనను తారస్థాయికి తీసుకెళ్తున్నాయి.