Wednesday, September 22, 2021

కె. విశ్వనాథ్‌ మొహానే స్క్రిప్ట్‌ విసిరికొట్టేశాడు

సినిమా.. సినిమా.. సినిమా… ఇదే సినీ జీవుల శ్వాస. తమలోని టాలెంట్‌తో ప్రేక్షక దేవుళ్లను మెప్పించడం ద్వారా సినీ కళామతల్లిని ప్రసన్నం చేసుకోవాని నిరంతరం మధన పడుతూనే ఉంటారు సినీ జనాలు. తాము తీస్తున్న సినిమా విజయం సాధించడం కోసం ఎంత దూరం అయినా వెళతారు.. ఎవరితోనైనా వాదనకు దిగుతారు.. అవసరం అయితే తమ స్థాయిని మరిచి అవతలి వారిపై కోపం ప్రదర్శిస్తుంటారు. అంతిమంగా వారికి కావాల్సింది సినిమా విజయం సాధించడం అంతే. ఇలా తన సినిమా విజయం కోసం తాను చెప్పిన వారి చేతే ఓ కీలక పాత్ర చేయించాలని పట్టుబట్టిన ఓ నిర్మాత తన చిత్రానికి దర్శకుడు అయిన ప్రఖ్యాత దర్శకుడు కె. విశ్వనాథ్‌ మొహాన స్క్రిప్ట్‌ విసిరి కొట్టాడట.

ఎప్పటి నుంచో తనతో అనుబంధం ఉన్న ఓ నిర్మాతను తనతో ఓ చిత్రం చేయమని అడిగారు కమల్‌ హాసన్‌. అభిరుచిగల నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్న ఆ నిర్మాత ఆ సమయానికి కొన్ని డబ్బింగ్‌ చిత్రాలతో ఆర్థికంగా నష్టపోయి ఉన్నారు. అందుకే కమల్‌ ఆఫర్‌ను తిరస్కరించాడు. అసలు కమల్‌హాసన్‌ డేట్స్‌ కోసం నిర్మాతలు క్యూలో నిలబడే పరిస్థితులలో ఆయనే తనతో సినిమా చేయమని అడిగితే ఎవరు కాదంటారు. అయినా ఆ నిర్మాతపై కమల్‌ ఒత్తిడి తెస్తూనే ఉన్నాడు. తాను భరోసాగా ఉంటానని నిర్మాతను ఎట్టకేలకు ఒప్పించాడు కమల్‌. అయితే దర్శకత్వ బాధ్యతలు మాత్రం కె. విశ్వనాథ్‌కే అప్పగించాలని ఇద్దరూ ఫిక్స్‌ అయిపోయారు. ఇక స్క్రిప్ట్‌ వర్క్‌ మొదలైంది.

రాత్రనక, పగలనక కష్టపడి అద్భుతమైన స్క్రిప్ట్‌ తయారు చేశారు విశ్వనాథ్‌ అండ్‌ కమల్‌. సినిమాలో కీలక పాత్ర మినహా ఆర్టిస్ట్‌లు కూడా ఫైనల్‌ అయిపోయారు. ఆ కీలక పాత్రను మాత్రం తాను చెప్పిన నటుడి చేతే చేయించాలని నిర్మాత కండిషన్‌ పెట్టి ఉండడంతో దర్శకుడు అనేక సార్లు నిర్మాతను ఆ నటుడి పేరు చెబితే డేట్స్‌ అడ్జెట్స్‌ చేసుకుంటానని అడిగారు. అయినా ఆ నిర్మాత ‘ఆ ఒక్కటి అడక్కు’ అన్నట్లు సమాధానం చెప్పేవారు కాదు. మరో నాలుగు రోజుల్లో షూటింగ్‌ ప్రారంభం. కీలకమైన ఆ పాత్రపైనే సినిమా అంతా తిరుగుతుంది. నిర్మాత మాత్రం తాను రికమండ్‌ దలుచుకున్న నటుడి పేరు చెప్పడం లేదు.

ఇక దర్శకుడి కోపం నషాళానికి అంటింది. నిర్మాతతో వాగ్వాదానికి దిగాడు. నిర్మాత కూడా అంతే స్థాయిలో ఎదురు తిరిగి ఈ పాత్రకు నేను రికమండ్‌ చేస్తున్నది నిన్నే అని విశ్వనాథ్‌తో అన్నారు. దీంతో విశ్వనాథ్‌ ఖంగు తిన్నారు. వెంటనే తేరుకుని ‘‘నేనేమన్నా నటుడినా. ఇప్పటి వరకూ తెరవెనుకే తప్ప, తెరమీద కనపడలేదు. ఈ పాత్ర నేను వేయడం కుదరదు’’ అంటూ సమాధానమిచ్చారు విశ్వనాథ్‌. నువ్వు నటించడం కుదరదు అంటే నేను నిర్మించడం కూడా కుదరదు అంటూ స్క్రిప్ట్‌ను విశ్వనాథ మొహాన (టేబుల్‌ మీద) విసిరికొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడట ఆ నిర్మాత.

ఇప్పటికే ఆ సినిమాపై మీకు కొంత క్లారిటీ వచ్చేసిందనుకుంటా.. అవును మీరు అనుకున్నట్లు ఆ సినిమా పేరు ‘శుభసంకల్పం ’. ఆ నిర్మాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. బాలుకు విశ్వనాథ్‌ను ఎదిరించే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా.. వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం మహిమ అది. మొత్తానికి విశ్వనాథ్‌ను నటుడిని చేసిన క్రెడిట్‌ బాలు ఆ విధంగా కొట్టేశారన్నమాట.

Latest Articles