అసలే దేశం గర్వించదగిన నటుడు పైగా తన పాత్రలో లీనమైపోయి శిఖరాగ్రస్థాయిలో రక్తికట్టించాడు. సినిమా చూస్తుంటే చప్పట్లు కొట్టని చేతులే ఉండవు… ఇంకేముంది ఆ అగ్ర నిర్మాత సహించలేక పోయాడు. అంతే యూనిట్ సభ్యులు వద్దని వారించినా కమల్‌ను చంపాల్సిందేనని తీర్మానించేశాడు. కమల్‌ను నిర్మాత చంపడానికి కుట్ర పన్నడమేమిటా అని ఆశ్చర్య పోకండి ఇదంతా ‘సాగరసంగమం’ చిత్రానికి సంబంధించిన మేటర్. ఇక విషయంలోకి వెళితే సుప్రసిద్ధ దర్శకుడు కె. విశ్వనాథ్, సుప్రసిద్ధ నటుడు కమల్ హాసన్, సుప్రసిద్ధ నిర్మాత ఏడిద నాగేశ్వరరావుల కలయికలో వచ్చిన ‘సాగరసంగమం’ చిత్రం గురించి తెలీని నాటి తరం ప్రేక్షకులు లేరు.
ఈసినిమాలో నటనాచార్యుడిగా కమల్ తన నట విశ్వరూపం ప్రదర్శించాడు. అయితే ముగింపు సన్నివేశంలో కమల హాసన్ పాత్ర బతికితే బాగుంటుందా? చనిపోతే బాగుంటుందా? అనే చర్చ మొదలయింది. యూనిట్ సభ్యులు అందరూ ఆ పాత్ర బతికుంటేనే బాగుంటుందని చెప్పారు. కమల్ ఆద్భుత నటన ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచి పోవాలంటే ఆయన్ను చంపి తీరాల్సిందేనని నిర్మాత ఏడిద నాగేశ్వరరావు వాదించారు. దర్శకుడు కె. విశ్వనాథ్ మాత్రం డైలమాలో ఉన్నారు. పాత్ర ఔన్నత్యం రీత్యా చూస్తే ఆ పాత్రకు విషాద ముగింపే కరెక్ట్. కానీ అప్పటికే కమల్ పెద్ద స్టార్ హీరో.
ఈ ముగింపును ఆయన అభిమానులు పాజిటివ్‌గా రిసీవ్ చేసుకుంటారా? లేదా? అనేది ఆయన సందేహం. అయినా కథే హీరో అని నమ్మడమే కాదు.. తన ప్రతి సినిమాతోనూ నిరూపించిన ఆయన నిర్మాత ఏడిదకే ఓటు వేశారు. ఏడిద నమ్మకం వమ్ము కాలేదు. ముగింపు సన్నివేశాన్ని చూసి కంటతడి పెట్టని ప్రేక్షకుడు లేడు. థియేటర్స్‌లో క్లైమాక్స్‌లో జయప్రద, శరత్‌బాబు కలిసి కమల్ డెడ్‌బాడీని గొడుగుపట్టి చక్రాల కుర్చీలో తీసుకు వెళుతుంటే ప్రేక్షకులు తమ కుర్చీల్లోంచి లేచి మరీ ఆనంద భాష్పాలతో కరాళతధ్వనులు చేయడం ఇప్పటికీ మర్చిపోలేని మధురానుభూతిగా మిగిలిపోయింది.