జగన్‌ తప్ప నాకు ఎవరు చెప్పినా వినను.. అంతే!

0
191

కనుమూరి రఘురామకృష్ణంరాజు.. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంట్‌ సభ్యుడు(వైసీపీ). ప్రముఖ పారిశ్రామిక, రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. స్వయంకృషితో వ్యాపార రంగంలో అందలానికి చేరిన ఆయన తాజాగా ఆంధ్ర రాజకీయాల్లో తనదైన శైలి వ్యాఖ్యతో కాకపుట్టిస్తున్నారు. జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలతో పాటు సినీ సెబ్రిటీలతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటం, ముఖ్యంగా తెలుగు రాజకీయ నాయకులతో పాటు, సినీ పెద్దల కుటుంబాలతో సాన్నిహిత్యం ఆయన అందరి వాడు అనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. వ్యక్తిగతంగా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఆయన సొంతం. పరిణామాలు ఏవైనా కానీ, తాను అనుకున్నది చేయడం, అనిపించింది మాట్లాడడం ఆయన నైజం.

దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్‌తో ఆయనకు చాలా అనుబంధం ఉంది. ఈ కారణంగానే 2014లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో తన రాజకీయ జీవితానికి పునాదులు వేసుకున్నారు. అనంతరం జరిగిన కొన్ని పరిణామాలతో ఆ పార్టీని వీడి బీజేపీలోకి, ఆ తర్వాత తెలుగు దేశంలోకి వెళ్లారు. 2019 ఎన్నికల సమయంలో మరల వైసీపీ తరపున నర్సాపురం పార్లమెంట్‌ సీటుకు పోటీ చేసి గెలుపొందారు. ముందు నుంచీ తాను అనుకున్నది చేసుకుపోయే మెంటాలిటీ ఉన్న ఆయన ఎవరికీ తల వంచే రకం కాదు. వ్యాపార వేత్తగా గతంలో తనకున్న జాతీయస్థాయి పరిచయాలకు తోడు ఇప్పుడు ఎంపీగా కూడా ఎన్నికవడంతో తనదైన దారిలో వెళుతున్నారు. ఈ వైఖరి నచ్చని వైసీపీ ఆయన్ను కట్టడి చేస్తోందనే వార్తలు కూడా వచ్చాయి.

ఇటీవల పార్లమెంట్‌లో ఇంగ్లీష్‌ మీడియంపై జరిగిన చర్చ, బుధవారం ఢల్లీిలో భారీ స్థాయిలో ఎంపీలకు విందును ఏర్పాటు చేయడం వంటివి పార్టీకి ఆయనకు మధ్య అగాధాన్ని పెంచాయనే వార్తలు గుప్పుమంటున్నాయి. దీనికి తోడు టీవీ9 ఎన్‌కౌంటర్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘సీఎం జగన్‌ తప్ప ఎవరు చెప్పినా నేను వినను.. అంతే!’’ అంటూ వ్యాఖ్యానించడం రాజుగారు పార్టీతో అమీ తుమీకి సిద్ధమయ్యారనే వార్తలకు ఊతం ఇస్తున్నాయి. అలాగే రఘురామకృష్ణంరాజుకు చెక్‌ పెట్టటానికి అన్నట్లు ఆయన కుటుంబానికి చెందిన గోకరాజు గంగరాజు సోదరులను, గంగరాజు కుమారుణ్ణి వైసీపీలోకి ఆహ్వానించి కండువాలు కప్పారు జగన్‌. వారు పార్టీలోకి వస్తున్న విషయం వారు వచ్చేదాకా నాకు తెలియదు అని రాజుగారు చెప్పడం భవిష్యత్‌లో కొన్ని కీలక పరిణామాలు జరగబోతున్నాయని చెప్పకనే చెబుతున్నాయి.