తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కేసు కోడికత్తి దాడి కేసు. నాటి ప్రతిపక్ష నాయకుడు, నేటి ముఖ్యమంత్రి వై.యస్. జగన్‌మోహన్‌రెడ్డిపై 2019 ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో కోడికత్తితో దాడి జరిగింది.
అప్పట్లో ఇది ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం కలిగించింది. ఆ ఘటన జరిగినప్పుడే కాదు.. ఇప్పటికీ ఈ కేసు సంచలనమే.
ఆరోజు ఎయిర్‌పోర్ట్‌లో జగన్‌పై దాడి చేశాడనే కారణంతో ఎయిర్‌పోర్ట్‌లోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జనుపల్లి శ్రీను అనే దళిత యువకుణ్ణి అరెస్ట్ చేశారు.
ఈ దాడి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే ఎయిర్‌పోర్ట్‌లో జరిగినందున కేసును ఎన్.ఐ.ఏకు అప్పగించారు. నాటి నుంచి ఈ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న శ్రీనివాస్‌కు బెయిల్ కూడా మంజూరు కాలేదు.
ఈ కేసులో బాధితుడు అయిన జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటి వరకూ కోర్టుకు హాజరు అయి తన స్టేట్‌మెంట్ ఇవ్వనందున సదరు శ్రీనివాస్ ఇప్పటికీ జైల్లోనే మగ్గిపోతున్నాడు.
తాజాగా ఈ కేసులో తన కొడుక్కి జరుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ జనుపల్లి శ్రీనివాస్ తల్లి సావిత్రి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. దీంతో ఇప్పుడు ఏపీలో ఈ దీక్ష పెను సంచలనం సృష్టించనుంది.
ముందుగా ఈనెల 12 నుంచి విజయవాడ ధర్నా చౌక్‌లో ఆమరణదీక్షకు అనుమతి కోరినప్పటికీ పోలీసులు ఇందుకు అనుమతిని నిరాకరించారు.
దీంతో గురువారం నుంచి సావిత్రి ఆమె నివాసంలోనే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..
అంబేద్కర్ ఆశయాలకు వారసుడైన ఓ దళిత బిడ్డను దాదాపు ఐదు సంవత్సరాలుగా బెయిల్ కూడా రాకుండా జైల్లో పెట్టించి, ఇప్పుడు జగన్ భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అంబేద్కర్‌కు వెన్నుపోటు పొడవడమే.
కొడుకు నిరపరాధి. ఈ విషయం జగన్‌కు కూడా తెలుసు. కానీ ఆయన కోర్టుకు వచ్చి సాక్ష్యం చెపితేనే నా బిడ్దకు బెయిల్ వస్తుంది. ఇంతకాలం జగన్ మనసు కరుగుతుందని ఎదురు చూశాను.
ఇక నా వల్ల అయింది ఆమరణ నిరాహార దీక్ష మాత్రమే. నా చావుతోనైనా నా బిడ్డకు విముక్తి లభిస్తుంది అని ఆశిస్తున్నాను అన్నారు.
ఇప్పటికే ఈ కేసు వార్తల్లోకి వచ్చిన ప్రతిసారీ జగన్‌మోహన్‌రెడ్డి, వైసీపీ పెద్దలు ఉలిక్కి పడుతుంటారు. ఇప్పుడు సావిత్రమ్మ దీక్ష రేపబోయే దుమారాన్ని తాడేపల్లి ప్యాలెస్ ఎలా తట్టుకుంటుందో చూడాలి