
మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన పూసలమ్మే అమ్మాయి మోనాలిసా భోంస్లే రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సంచలనంగా మారింది. 16 ఏళ్ల మోనాలిసా ప్రయాగ్ రాజ్‌లో జరిగిన మహా కుంభమేళా సందర్బంగా విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఆమె అందం, ఆకర్షణతో అనేక మంది దృష్టిని ఆకర్షించడంతో సినిమాటోగ్రఫీ రంగానికి చెందిన పలువురు దర్శకనిర్మాతలు ఆమెకు అవకాశాలు కల్పించేందుకు ముందుకు వచ్చారు. బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా కూడా ఆమెను ఇంటికి వెళ్లి కలుసుకొని తన సినిమాలో అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించాడు. అంతేకాదు, ఆమెను ముంబయికి తీసుకెళ్లి అక్కడ నటన శిక్షణ పొందేలా ఏర్పాటు చేశాడు.
అయితే, ఈ వ్యవహారంపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. నిర్మాత జితేంద్ర నారాయణ్ సింగ్ సనోజ్ మిశ్రా తీరును తీవ్రంగా తప్పుబట్టారు. మోనాలిసాను మోసం చేస్తున్నాడని, పబ్లిసిటీ కోసం ఉపయోగించుకుంటున్నాడని ఆరోపించారు. ఆమెను ట్రాప్ చేసి, వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నాడని అన్నారు. అయితే, సనోజ్ మిశ్రా ఈ ఆరోపణలను ఖండించారు. మోనాలిసా వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమేనని, తన కుమార్తె వయస్సున్న అమ్మాయిలా ఆమెను గౌరవిస్తున్నానని చెప్పాడు. ఆమె క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశ్యం తనకు లేదని, ఆమెకు మద్దతుగా నిలిచి, మార్గనిర్దేశం చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు.
మోనాలిసా భద్రతకు సంబంధించి వస్తున్న పుకార్లను నమ్మొద్దని, ఆమెకు ఎలాంటి అనుభవంలేకపోవడంతో తాను సహాయం చేస్తున్నానని సనోజ్ చెప్పారు. కుంభమేళాలో అనూహ్యంగా పాపులర్ అయిన మోనాలిసా ఇంటికి తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చినట్టు తెలిపారు. ఈ పరిణామంతో ఆమె కుటుంబానికి తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయని చెప్పారు. ఎంతో మంది మోనాలిసాపై ఆసక్తి చూపించినా, ఆమె కుటుంబాన్ని సాయపడటానికి ఎవరూ ముందుకు రాలేదని వాపోయారు.
తాను మాత్రం తన మనస్సాక్షి ప్రకారం వ్యవహరిస్తున్నానని, మోనాలిసాకు తన శక్తి మేరకు సహాయం అందిస్తున్నానని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఎంతో మంది తనకు మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఆమె కుటుంబం ఆర్థికంగా చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందని తెలిసి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. మోనాలిసాకు నటనలో శిక్షణ ఇప్పించి, మంచి అవకాశాలు వచ్చేలా చేయాలని తాను కృషి చేస్తున్నానని వివరించారు.
జితేంద్ర నారాయణ్ సింగ్ చేసిన ఆరోపణలను ప్రస్తావించకుండా, తనపై కొన్ని శక్తి వంతమైన వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సనోజ్ అన్నారు. తన సినిమా ‘ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్’ షూటింగ్ సమయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. మోనాలిసాకు ఈ సినిమాలో కీలక పాత్రను ఆఫర్ చేశానని, ఆమె సత్తా చాటేందుకు తాను అన్ని విధాలుగా సహాయపడతానని చెప్పారు.