![Screenshot_20250214-194026_Facebook](https://apmessenger.com/wp-content/uploads/2025/02/Screenshot_20250214-194026_Facebook-1024x646.jpg)
‘లైలా’ సినిమా విడుదలకు ముందు విశ్వక్ సేన్ చేసిన ప్రమోషన్స్ వల్ల దీనిపై మంచి హైప్ క్రియేట్ అయింది. ముఖ్యంగా ఆయన లేడీ గెటప్ లో కనిపించడం, ‘బాయ్ కాట్ లైలా’ హ్యాష్ ట్యాగ్ వైరల్ కావడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. అయితే వాలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూడాలి.
కథ :
సోనూ అనే యువకుడు ఓల్డ్ సిటీకి చెందినవాడు. తల్లి సహాయంతో తన ఏరియాలో ఒక బ్యూటీ పార్లర్ ప్రారంభిస్తాడు. అతను మేకప్ మాయాజాలంతో అక్కడికి వచ్చే అమ్మాయిలను అందంగా తయారుచేయడం అతని ప్రత్యేకత. ఓరోజు అతను అందంగా రెడీ చేసిన అమ్మాయిని రుస్తుం అనే విలన్ ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. అయితే పెళ్లి తరువాత ఆమె అందంగా కనిపించకపోవడంతో అతనికి కోపం వస్తుంది. దీంతో సోనూ మీద పగ పెంచుకుని అతన్ని చంపాలని నిర్ణయించుకుంటాడు.
మరోవైపు ఒక పోలీస్ భార్య కూడా సోనూ వద్ద మేకప్ వేయించుకోవడానికి వస్తుంది. అయితే అదే సమయంలో సోనూ ఇంకొకరికి మేకప్ వేస్తూ ఉండటంతో ఆమె ముందుగా తనకు మేకప్ వేయాలని ఒత్తిడి చేస్తుంది. దీంతో గొడవ జరుగుతుంది. ఇది ఆ పోలీస్ వరకు వెళ్లడంతో అతను కూడా సోనూపై పగ పడతాడు. ఈ పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి సోనూ ‘లైలా’ గా మారతాడా? ఆ తర్వాత ఏం జరుగుతుంది? అతని ప్రేమ కథ ఎలా కొనసాగుతుంది? అనే అంశాలు ఈ కథలో ఉన్నాయి.
సినిమా విషయానికి వస్తే, కథలో కొత్తదనం లేకపోవడం ప్రధానమైన సమస్య. ఫస్ట్ హాఫ్ లో ఉన్న కామెడీ కొంతవరకు టైం పాస్ చేయించవచ్చు. కానీ అది కూడా లాజిక్ లేకుండా ఉండటంతో అందరికీ కనెక్ట్ కావడం లేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కథ నాసిరకంగా సాగడంతో ప్రేక్షకులకు అది ఓ పరీక్షలా మారింది. పాటలు రెండు బాగున్నాయి, అవి అందంగా చిత్రీకరించారు. నిర్మాణ విలువలు కూడా మెరుగ్గా ఉన్నాయి. కానీ కథ బలహీనంగా ఉండటంతో సినిమాకు పెద్దగా ఉపయోగపడలేదు.
విశ్వక్ సేన్ నటన కూడా చాలా రొటీన్ గా ఉంది. లైలా పాత్రలో ఆయన చెప్పిన డబుల్ మీనింగ్ డైలాగులు పెద్దగా వర్కౌట్ కాలేదు. గతంలో అలీ, మంచు మనోజ్ చేసిన లేడీ గెటప్ పాత్రలతో పోల్చితే ఇది పెద్దగా ఆకట్టుకోలేదు. హీరోయిన్ ఆకాంక్ష గ్లామర్ తో సినిమా ను మేనేజ్ చేయడానికి ప్రయత్నించింది. 30 ఇయర్స్ పృథ్వీ కామెడీ ట్రాక్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. విలన్ గా అభిమన్యు సింగ్ పాత్ర కూడా ఒకేఒక్క ఫార్ములా విలన్ గా కనిపించింది. మిగిలిన నటీనటుల పాత్రలు కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. మొత్తానికి హైప్ కి పూర్తి భిన్నంగా లైలా మూవీ ఉంది.
రేటింగ్: 1.0