Wednesday, September 22, 2021

ఆ మంత్రిని వదిలేసి నన్నే ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు.. వైసీపీ ఎమ్మెల్యే ఫైర్‌..!

మొగుడు కొట్టినందుకు కాదు.. తోడికోడలు నవ్వినందుకు అన్నదట వెనకటికి ఒకావిడ. ప్రస్తుతం రాజకీయ నాయకుల పరిస్థితి కూడా అలాగే ఉంది. తాము మీడియా టార్గెట్‌ అవటం అటుంచి.. తమ పక్కవారు కాలేదన్న బాధ ఎక్కువగా వారిని వేధిస్తోంది. ఇటీవల పలు వివాదాస్పద అంశాల ప్రస్తావనతో అలజడి సృష్టించిన తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కొద్ది రోజుల క్రితం పి. గన్నవరం నియోజకవర్గంలోని ల0కల గన్నవరంలో ఇసుక మాఫియా దౌర్జన్యం అంటూ సోషల్‌ మీడియా వేదికగా ఓ వీడియో వైరల్‌గా మారింది. ఇందులో కుసుమ సునీత అనే మహిళ తన కుమారుడితో కలిసి ఓ భూమి వద్ద హల్‌చల్‌ చేసింది. ఈ సందర్భంగా ఆమె కుమారుడి వద్ద ఓ గన్‌ కూడా దొరికింది. దీంతో ఈ వార్త ప్రధాన మీడియాకు కూడా ఎక్కింది.

అనంతరం జరిపిన పోలీసు విచారణలో అది బొమ్మ తుపాకీగా తేలింది. సునీత పలువురు రాజకీయ నాయకులతో దిగిన ఫొటోలను కూడా మీడియా ప్రసారం చేసింది. ఇందులో పి. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుతో సునీత దిగిన ఫొటో కూడా ఉంది. దీంతో ఎమ్మెల్యే మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజూ అనేక మంది మాతో ఫొటోలు దిగుతారు అంత మాత్రాన వారందరితో మాతో సంబంధాలు ఉంటాయా?.

అక్కడ జరిగింది ఇసుక మాఫియా గొడవలు కావు. అదో భూ వివాదం. అయినా నేను ఎస్సీ నియోజక వర్గానికి చెందిన ఎమ్మెల్యేను కాబట్టే నన్ను టార్గెట్‌ చేస్తున్నారు. మరి పక్కనే ఉన్న అమలాపురానికి చెందిన మంత్రి గారిని ఎందుకు ప్రశ్నించరు అంటూ మంత్రి పినిపే విస్వరూప్ ను కూడా ఈ వివాదంలోకి లాగే ప్రయత్నం చేశారు.

Latest Articles