ఆ ఛానల్స్‌ నిర్ణయంతో టాలీవుడ్‌కు భారీ షాక్‌ తప్పదా?

0
1141

దేశంలోనే అతిపెద్ద రెండో సినీ ఇండస్ట్రీ మన టాలీవుడ్‌ది. ఇంతింతై.. వటుడిరతై అన్నట్లుగా వేల రూపాయల బడ్జెట్‌తో మొదలైన టాలీవుడ్‌ చరిత్ర లక్షకు, ఆ పై 5 నుంచి 10 కోట్లకు చేరింది. ఇక్కడ నుంచి అమాంతం 50 కోట్లు, 100 కోట్లు అంటూ రాకెట్‌ వేగంతో దూసుకు పోయింది. అలాగే లాభా వాటా కూడా నానాటికీ పెరుగుతూనే వచ్చింది. బడ్జెట్‌ విషయంలో ఇంతటి వేగానికి కారణాల్లో ముఖ్యమైంది డిజిటల్‌, శాటిలైట్‌ మార్కెట్‌. ప్రభుత్వ ఛానల్‌ అయిన దూరదర్శన్‌ ప్రారంభంలో నిర్మాత నుంచి అంగీకార పత్రం తీసుకుని సినిమాను ప్రదర్శించేవారు. ఆ తర్వాత నామ మాత్రం చెల్లించేవారు. కాల క్రమంలో ప్రైవేటు శాటిలైట్‌ ఛానల్స్‌ పెరిగి పోవడంతో సినిమా హక్కులకు గిరాకీ రావడం మొదలైంది. జెమినీ టీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్‌ ఒక్కటే సినిమా హక్కులను స్వంతం చేసుకునేది. ఆ తర్వాత ఈటీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్‌ రావడంతో పోటీ మొదలైంది.

మాటీవీ ఎంట్రీతో పోటీ రసవత్తరంగా మారగా, జీ టీవీ అడుగు పెట్టడంతో ఈ పోటీ తారాస్థాయికి చేరింది. వీటి మధ్య పోటీతో కొందరు నిర్మాతలు లాభాల పంట పండిరచుకున్నారు కూడా. కాలక్రమంలో ఈ పోటీ తమకు నష్టం చేకూర్చేదే అని తెలుసుకున్న ఈటీవీ, జీ లు ఈ పోటీ నుంచి విరామం తీసుకున్నాయి. ప్రస్తుతం పోటీలో ఉన్న మాటీవీ, జెమిని కూడా విరామం బాట పట్టడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. ఇటీవ కాలoలో ఛానల్స్‌లో ప్రసారం అవుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌లు టీఆర్పీ విషయంలో వెనుకబడి పోతున్నాయి.

ఈ కారణంగానే యాడ్స్‌ కూడా తగ్గిపోవడంతో ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తమలో తాము పోటీ పడి మరీ హక్కులు దక్కించుకోవడం, పోటీపడి మరీ ప్రైమ్‌ టైమ్‌లో క్రేజీ సినిమాలు వేస్తుండడంతో ఎవరికీ సరైన టీఆర్పీ రేటింగ్‌ రావట్లేదు. దీనికి తోడు డిజిటిల్‌ మార్కెట్‌ మునుపటికన్నా వేగంగా పెరగడం కూడా తమ లాభాలను గట్టిగానే దెబ్బ తీస్తున్నట్లు ఛానల్స్‌ భావిస్తున్నాయి. ఇప్పటి వరకూ భారీగా ఆఫర్స్‌ ఇవ్వడం వల్ల దానికి అవాటు పడిన నిర్మాతలు ఇప్పుడు రేట్ల విషయంలో తగ్గమన్నా తగ్గే అవకాశం లేదు. కాబట్టి కొంతకాలo విరామం ప్రకటిస్తేనే మనుగడ అనే భావనలో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్స్‌ ఉన్నట్లు తోస్తోంది. ఇందుకు సంబంధించి గతవారం సినీ, రాజకీయ రంగానికి చెందిన ఓ ప్రముఖుడి స్టార్‌ హోటల్‌లో ఛానల్స్‌ ముఖ్యులు సమావేశమై ఈ విరామ నిర్ణయం గురించి తీవ్రంగా ఆలోచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ సమావేశంలో కొందరు ప్రముఖ డిజిటల్‌ హక్కుల కొనుగోలు దారులు కూడా పాల్గొన్నారట.

విరామ నిర్ణయం అమలు పక్కాగా జరిగితే మాత్రం శాటిలైట్‌ హక్కులపై ఆధారపడి బడ్జెట్‌లు, రెమ్యునరేషన్స్‌ పెంచుకుంటూ పోయిన నిర్మాతలు పునరాలోచనలో పడక తప్పని పరిస్థితి. తద్వారా మిగిలిన అన్ని రంగాల్లోనూ బడ్జెట్‌కు లిమిటేషన్స్‌ వస్తాయి. ఇప్పుడు కేవలo శాటిలైట్‌కే పరిమితమైన ఈ ఆలోచన రేపు మిగిలిన డిజిటల్‌ మీడియాకు కలిగే అవకాశం లేకపోలేదు. అప్పుడు వారు కూడా సినిమా డిజిటల్‌ రైట్స్‌ కొనుగోలు విషయంలో ఆచి తూచి వ్యవహరించవచ్చు. కాబట్టి రాబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టి వాస్తవికతకు, వసూళ్లకు తగ్గట్టుగా పరిశ్రమ అడుగు వేస్తే మంచిది. కాదూ కూడదూ అంటూ మొండి పట్టుదలకు పోతే భారీ షాక్‌కు గురి కాక తప్పదు.