Wednesday, September 22, 2021

‘కన్నెం సతీశ్’.. ఓ శాడిస్ట్ ప్రేమకథ!

ఈ హెడ్డింగ్ చదవి ఇదేదో తెలుగు సినిమా టైటిల్ విత్ ట్యాగ్‌లైన్ అనుకుంటున్నారా.. అయితే మీ తప్పులేదు. ఆకట్టుకునే టైటిల్స్.. అదిరిపోయే ట్యాగ్‌లైన్‌లతో తెలుగు సినిమా యవ్వారం యమ జోరుగా ఉన్న మాట వాస్తవం. ఇది మాత్రం సినిమా కాదు.. ఓ శాడిస్ట్ ప్రేమకథ. శాడిస్ట్ ప్రేమకథ అనగానే ఇందులో నెగెటివ్ టచ్ ఉండి తీరాలి కదా.. అదీ ఉంది. విషయంలోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలోని గౌరీపట్నం గ్రామానికి చెందిన పమ్మె దీప అనే యువతిని కన్నెం సతీష్ అనే ప్రేమోన్మాది కత్తితో పొడిచి హత్యాయత్నం చేశాడు.

అనంతరం ఆమెను తాను వేసుకొచ్చిన ఆటోలోనే ఎక్కించుకుని కొవ్వూరులోని ప్రభుత్వాసుపత్రిలో చేర్చి పరారయ్యాడు. ప్రస్తుతం రాజమండ్రిలోని ప్రభుత్వాసుపత్రిలో చావుబతుకుల మధ్య ఆమె కొట్టు మిట్టాడుతోంది. రాజమండ్రిలోని బొల్లినేని ఆసుపత్రిలో పనిచేసే దీపను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు కన్నెం సతీష్ అనే యువకుడు.

ఆటోడ్రైవర్ అయిన ఇతని ఆటోలో దీప కొన్నిసార్లు ప్రయాణించడంతో అతను ఈమెపై ప్రేమ వేధింపులు మొదలు పెట్టాడు. గురువారం తన సెద్యోగిని వీరమణితో కలిసి ఆటో కోసం రోడ్డుపై ఎదురు చూస్తుండగా, తాను వేసుకొచ్చిన ఆటోలో ఎక్కాల్సిందిగా ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. అదే సమయంలో వీరమణి భర్త తన ఆటోతో అక్కడికి రావడంతో దాంట్లో ఎక్కారు.

కొద్దిదూరం వెళ్లిన తర్వాత అడ్డగించి కత్తితో పొడిచేశాడు సతీష్. తీవ్రంగా గాయపడిన దీపను మరల తానే తన ఆటోలో వేసుకుని ఆసుపత్రిలో చేర్చటం ఈ శాడిస్ట్ ప్రేమకథలో చిన్న ట్విస్ట్. ప్రస్తుతం ఈ తరహా ప్రేమోన్మాదుల దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఇటువంటి వేధింపులు ఏవైనా ఉంటే మొదట్లోనే ఇంట్లోని వారికి చెప్పడం ద్వారా మహిళలు భవిష్యత్తులో జరగబోయే దాడులకు చాలా వరకు అడ్డుకట్ట వేయవచ్చు.

Latest Articles