
ఇండియన్ సినిమా చరిత్రలోనే అతిపెద్ద చిత్రంగా మారే అవకాశమున్న రాజమౌళి-మహేష్ బాబు మూవీ ఎట్టకేలకు సెట్స్ మీదికి వెళ్లింది. చాలా కాలంగా ఈ సినిమా గురించి వార్తలు వస్తున్నా, షూటింగ్ ప్రారంభం కావడానికి మాత్రం చాలా సమయం పట్టింది. అయితే చిత్రబృందం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకుండానే షూటింగ్ మొదలుపెట్టింది. హైదరాబాద్ శివార్లలో వేసిన భారీ సెట్లో ఈ చిత్రం మొదటి షెడ్యూల్ జరుపుకుంటుందట.
సినిమా షూటింగ్ ప్రారంభమైనా, అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోవడం మహేష్ బాబు అభిమానులను కొంత నిరాశకు గురి చేసింది. రాజమౌళి సినిమాలంటే ప్రేక్షకులకు ఎంతో ఆసక్తి. ఆయన ప్రతి ప్రాజెక్ట్‌కి ముందు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి వివరాలు షేర్ చేసుకోవడం మామూలే. అయితే ఈసారి మహేష్ బాబు మూవీ విషయంలో మాత్రం జక్కన్న పూర్తిగా సైలెంట్‌గా ఉంటూ వస్తున్నారు. ఇప్పటివరకు సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం అందరిలోనూ ఒకింత సందేహాలను కలిగించింది.
అయితే తాజా సమాచారం ప్రకారం, రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ పూర్తయ్యాక చిత్ర బృందం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట. ఈ షెడ్యూల్ ముగియడానికి ఇంకా ఒక నెల సమయం పడుతుందట. అందువల్ల మార్చి చివర్లో లేదా ఏప్రిల్‌లో రాజమౌళి మీడియా ముందుకు వచ్చి, సినిమా కథాంశం గురించి క్లారిటీ ఇవ్వనున్నారు. అయితే ఈ ప్రెస్ మీట్లో మహేష్ బాబు పాల్గొనే అవకాశంలేదని తెలుస్తోంది. రాజమౌళి నిర్మాతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి, సినిమాకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను తెలియజేస్తారని సమాచారం.
ఈ చిత్రం గురించి ఇప్పటి వరకు వచ్చిన రూమర్స్ ప్రకారం, ఇది భారీ బడ్జెట్‌తో రూపొందనున్న అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా ఉండబోతుందట. 1000 కోట్లకు పైగా ఖర్చు చేసి రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని 2027లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. సినిమా కథ ఆఫ్రికా అడవుల నేపథ్యంతో సాగుతుందనే వార్తలు కూడా వచ్చాయి. మరి జక్కన్న తన మార్కు ప్రెస్ మీట్లో ఎలాంటి ఆసక్తికరమైన విశేషాలు పంచుకుంటారో చూడాలి.