సూపర్ స్టార్ మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘1 నేనొక్కడినే’ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో అంతగా విజయవంతం కాలేదు. అయితే, యూఎస్ లో మాత్రం మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత సుకుమార్, మహేష్‌తో మరో సినిమా చేయాలని భావించినప్పటికీ, అది కార్యరూపం దాల్చలేదు.
సుకుమార్ ‘పుష్ప’ చిత్రానికి ముందు మహేష్‌తో ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడు. కానీ మధ్యలోనే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయి, సుకుమార్ అల్లు అర్జున్‌తో ‘పుష్ప’ను మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలో మహేష్ కూడా సుకుమార్‌తో సినిమా ఆగిపోయిందని ట్విట్టర్లో చెప్పాడు. దీంతో వారిద్దరి మధ్య కొంత దూరం ఉందనే టాక్ అప్పట్లో వినిపించింది.
‘పుష్ప 1’ , ‘పుష్ప 2’తో సుకుమార్ పాన్ ఇండియా విజయాన్ని సాధించడంతో, ప్రస్తుతం ఆయన ఇండస్ట్రీలో తన స్థానం మరింత బలపరచుకున్నారు. ఇదే సమయంలో మహేష్, సుకుమార్ మధ్య ఉన్న దూరం కూడా తగ్గిందని చెప్పవచ్చు. సుకుమార్ కుమార్తె సుకృతి నటించిన ‘గాంధీ తాత చెట్టు’ ట్రైలర్‌ను మహేష్ లాంచ్ చేయడం, ఆ ట్రైలర్‌ను ప్రశంసించడమే ఇందుకు నిదర్శనం. ఈ సంఘటన సుకుమార్, మహేష్ మళ్లీ స్నేహబంధంలోకి వచ్చినట్టు స్పష్టమవుతుంది.
ప్రస్తుతం మహేష్ తన తదుపరి ప్రాజెక్ట్ రాజమౌళి సినిమా మీద పూర్తిగా దృష్టి పెట్టారు. ఈ చిత్రానికి మహేష్ మూడు సంవత్సరాల టైం కేటాయించగా, దీనికోసం కొత్త లుక్ కూడా ట్రై చేస్తున్నారు. రాజమౌళి సినిమా తర్వాత మహేష్, సుకుమార్ కాంబినేషన్ మళ్లీ సెట్ అయితే, అభిమానులకు పండగే. ‘పుష్ప 2’తో సుకుమార్ ప్రూవ్ చేసుకున్న టాలెంట్, మహేష్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌లపై ఉన్న ఫోకస్ కలిసి వస్తే, ఇండియన్ సినిమా స్థాయిని ఇంకో మెట్టు ఎక్కించే ప్రాజెక్ట్ రూపుదిద్దుకోవచ్చు.
ఇక మహేష్ సినిమాల ప్లానింగ్ చూస్తే, ఆయన ప్రాజెక్ట్‌లు కేవలం పాన్ ఇండియా స్థాయికి కాకుండా, పాన్ వరల్డ్ స్థాయికి వెళ్లేలా ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు. మహేష్, సుకుమార్ మళ్లీ కాంబినేషన్‌కి రావడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను మెప్పించే సూపర్ హిట్ అందిస్తే, అది తెలుగు సినిమా చరిత్రలో మరో ఘట్టం అవుతుంది.