దర్శకధీరుడు రాజమౌళి అంటేనే సినీ ఇండస్ట్రీలో చాలా ప్రత్యేకత ఉంది . ఆయన తీసే సినిమాల్లో మొదటి పోస్టర్ నుంచి చివరి కార్డ్ వరకూ రాజమౌళి మార్క్ అనిపించేలా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి ప్రాధాన్యతనిస్తూ, పెర్ఫెక్షన్ కోసం నిరంతరం కష్టపడే రాజమౌళి తన సినిమాలతో అనేక విజయాలు సాధించారు. ముఖ్యంగా, తెలుగు సినిమాను ప్రపంచస్థాయిలో ప్రాతినిధ్యం వహించేలా చేసిన ఘనత ఆయనదే.
బాహుబలి’ సిరీస్‌తో పాటు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో టాలీవుడ్ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చారు. ప్రత్యేకంగా ఆస్కార్ అవార్డు తెచ్చిన ‘నాటు నాటు’ పాట ద్వారా రాజమౌళి టాలీవుడ్ సినిమాలకు అజరామరమైన గుర్తింపు తీసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ఆయన తదుపరి చిత్రం ‘SSMB 29’ గురించి అనౌన్స్‌మెంట్ వచ్చేనాటికే విపరీతమైన హైప్ క్రియేట్ అయింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ సినిమా ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే అడ్వెంచర్ డ్రామాగా ఉంటుందని ఇప్పటికే సమాచారం అందింది. హైదరాబాద్లో సింపుల్‌గా పూజా కార్యక్రమాలు పూర్తవగా, జనవరి చివరలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందనుందని, 2026లో మొదటి భాగం విడుదలయ్యే అవకాశముందని టాక్. భారీ బడ్జెట్‌తో కేఎల్ నారాయణ నిర్మాణం వహిస్తుండగా, ఈ సినిమా రాజమౌళి స్టాండర్డ్స్‌కు తగ్గట్టుగా మరో మైలురాయి అవుతుందనడంలో సందేహం లేదు.
రాజమౌళి ఇప్పటికే ‘బాహుబలి-2’ మరియు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలతో రూ.1000 కోట్ల క్లబ్‌లోకి రెండుసార్లు ఎంటరైన మొదటి దక్షిణాది దర్శకుడిగా రికార్డు సృష్టించారు. ఇప్పుడు ‘SSMB 29’ ద్వారా రూ.3000 కోట్ల మార్క్‌ను టార్గెట్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాన్ వరల్డ్ ప్రమోషన్స్‌ను దృష్టిలో పెట్టుకుని, వివిధ దేశాల్లో ఆడియన్స్‌ను కనెక్ట్ చేసేందుకు ఆయన ప్రత్యేక ప్రణాళికలు రూపొందించనున్నారని తెలుస్తోంది.
ఇప్పటివరకు ‘పుష్ప 2: ది రూల్’ రూ.2000 కోట్ల క్లబ్‌కు చేరుకునే దిశగా ఉన్న నేపథ్యంలో, రాజమౌళి ఈ చిత్రంతో మరింతగా రికార్డులను తిరగరాయడం ఖాయం. ఆయన దృష్టి వసూళ్ల కంటే ప్రతిష్టపై ఎక్కువగా ఉండటంతో, ఈ సినిమా కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేసే అవకాశం ఉందని సినిమా ప్రియులు భావిస్తున్నారు. ‘SSMB 29’ రూపంలో మరో విశ్వవిజయం అందుకోవడానికి రాజమౌళి సిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు.