సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించబోతున్న పాన్ వరల్డ్ సినిమా ‘SSMB29’ గురించి ఆసక్తికరమైన వివరాలు వెలుగుచూస్తున్నాయి. ఈ రోజు భారీ స్థాయిలో లాంచ్ ఈవెంట్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభం చేయనున్నారని సమాచారం. మహేష్ బాబు ఈ చిత్రంలో వరల్డ్ అడ్వాంచర్ ట్రావెలర్ పాత్రలో కనిపించనున్నారు.
ఈ చిత్రాన్ని సుమారు 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించేందుకు జక్కన్న సిద్ధమయ్యారు. అంతేకాకుండా, ఈ ప్రాజెక్ట్‌ను రెండు భాగాలుగా రూపొందించబోతున్నారు. ప్రొడక్షన్ ప్రారంభమైన తర్వాత బడ్జెట్ మరింత పెరగవచ్చని తెలుస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో చిత్రాన్ని తెరకెక్కించేందుకు హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ కూడా భాగస్వామ్యం అవుతుందనే టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమా కోసం మహేష్ బాబు తన రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటాను మాత్రమే కోరారని సమాచారం. అలాగే దర్శకుడు రాజమౌళి కూడా అదే విధంగా లాభాల్లో వాటా తీసుకోబోతున్నారు. నిర్మాత కెఎల్ నారాయణ ఈ చిత్రానికి బడ్జెట్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ముందుకు వెళ్తున్నారు. మహేష్ బాబు, రాజమౌళి ఇద్దరికీ లాభాల్లో 25 శాతం వాటా ఇచ్చేందుకు నిర్మాత సిద్ధమయ్యారు.
ఇక నటీనటుల విషయానికొస్తే, మహేష్ బాబుకు జోడీగా ప్రియాంక చోప్రా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే విలన్ పాత్రకు పృథ్వీరాజ్ సుకుమారన్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. అంతేకాకుండా, హాలీవుడ్ నటీనటులు కూడా ఈ చిత్రంలో భాగస్వామ్యమవుతారని చెబుతున్నారు.
‘SSMB29’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మొదటి భాగాన్ని 2027లో, రెండో భాగాన్ని 2029లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
రాజమౌళి ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి పలు ప్రత్యేకమైన లొకేషన్స్‌ను ఫైనల్ చేశారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి అంతర్జాతీయ ప్రమోషన్ల కోసం హాలీవుడ్ డైరెక్టర్‌ను కూడా రంగంలోకి దించారన్న టాక్ వినిపిస్తోంది.
ఈ రోజు లాంచ్ ఈవెంట్ కోసం సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘SSMB29’తో మహేష్ బాబు, రాజమౌళి మరోసారి ప్రపంచ సినీ వేదికపై మెరుస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.