ప్రతి కుటుంబంలోనూ గొడవలు సహజమే. సామాన్యులా, సెలబ్రెటీలా అనే తేడా లేకుండా ఇలాంటి సమస్యలు ఉంటాయి. కానీ ఇంట్లోని గొడవలు బయటకు వెళ్లకుండా సర్దుపుచ్చుకోవడం చాలా ముఖ్యమైంది. ఇది సెలబ్రెటీలకైతే మరింత కష్టంగా మారుతుంది. ఎందుకంటే చిటుక్కుమన్నా మీడియా మైక్‌తో అందుబాటులో ఉంటుంది. ఇటీవల మంచు ఫ్యామిలీ వివాదం కూడా ఇలాగే జరిగింది. మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద జరగిన ఘటనలతో విషయం పెద్ద దుమారమే రేపింది. అంతటితో ఆగకుండా గొడవలు మళ్లీ మొదలయ్యాయి.
మంచు మనోజ్, మోహన్ బాబు యూనివర్సిటీలోకి వెళ్లడం, అక్కడ గొడవ జరగడం అందరికీ తెలుసు. ఇక ఈ వివాదం సోషల్ మీడియాలోకి చేరుకుంది. విష్ణు మంచు తాజాగా తన ట్విట్టర్‌లో “సింహం అవ్వాలని ప్రతి కుక్కకీ ఉంటుంది, కానీ వీధిలో మొరగడం, అడవిలో గర్జించడం మధ్య తేడా ఉంది” అనే డైలాగ్‌ను పోస్ట్ చేశారు. ఇది మోహన్ బాబు నటించిన “రౌడీ” చిత్రంలోనిది. తనకు ఆ డైలాగ్ చాలా ఇష్టమని, ఆ చిత్రాన్ని ఆర్జీవి అద్భుతంగా తీశారని విష్ణు పేర్కొన్నారు.
విష్ణు పెట్టిన ట్వీట్‌కు మంచు మనోజ్ ఘాటుగా స్పందించారు. “కృష్ణం రాజు గారి లాగా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకీ ఉంటుంది. ఈ విషయాన్ని నువ్వు ఈ జన్మలోనే నేర్చుకుంటావు” అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా కన్నప్ప సినిమాలో రెబల్ స్టార్ కృష్ణం రాజుగారిలా సింహంగా ఉండాలనిపించడం సహజమని, విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప పై కూడా సెటైర్ వేశారు. దీనివల్ల విష్ణు ప్రాజెక్ట్ మీద మనోజ్ వ్యంగ్యంగా స్పందించారని అర్థమవుతోంది.
ఇప్పుడు వీరి ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు ఒకవైపు సలహాలు ఇస్తుంటే, మరికొంతమంది ఈ వివాదాన్ని గమనించి పాత సినిమా టైటిల్స్ పెట్టి ట్రోలింగ్ చేస్తున్నారు. “అన్నదమ్ముల సవాల్” లేదా “ఆఖరి పోరాటం” అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఈ గొడవలన్నీ సమసిపోవాలని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో జరిగే వివాదాలను బయటకు రాకుండా సర్దుబాటు చేసుకోవడం మంచిదని అంటున్నారు. కానీ సెలబ్రెటీల కుటుంబంలో వ్యక్తిగత వ్యవహారాలు మీడియా ద్వారా చర్చనీయాంశాలు అవ్వడం ఎప్పటినుంచో జరుగుతున్న విషయమే.