మంచు ఫ్యామిలీ వివాదం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఓ సందర్భంలో జర్నలిస్టుపై దాడికి పాల్పడినందుకు సినీ నటుడు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే ఇప్పుడు తాజాగా మోహన్ బాబు ఎక్కడా కనిపించడం లేదు అనే వార్త సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది.
హైకోర్టు ఇటీవల తమ తీర్పు వెలువరించింది. జర్నలిస్టుపై దాడి అనంతరం విచారణకు రావాల్సిన సమయంలో మోహన్ బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అందువల్ల, హైకోర్టు ఆయనకు ఈ నెల 24 వరకూ అరెస్టు మినహాయింపు ఇచ్చింది. కానీ, ఆ గడువు ముగిసిపోయింది.
తాజాగా ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు కోర్టును మరోసారి ఆశ్రయించగా, కోర్టు ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో పోలీసులు మోహన్ బాబును అదుపులోకి తీసుకునే అవకాశాలపై చర్చ ప్రారంభమైంది. అయితే, ప్రస్తుతం ఆయన ఆచూకీ లభించకపోవడం చర్చనీయాంశమైంది.
మోహన్ బాబు తిరుపతిలో ఉన్నారని, చంద్రగిరిలో ఉన్నారని సమాచారం అందినప్పటికీ, అక్కడ ఆయన లేరని తేలింది. ఇదే సమయంలో మోహన్ బాబు అమెరికాలో తలదాచుకున్నారనే ప్రచారం ఊపందుకుంది. హైకోర్టు తీర్పు వెలువడిన అనంతరం, ఈ నెల 16న హైదరాబాద్ నుంచి చంద్రగిరికి వెళ్లినట్లు సమాచారం. అయితే అక్కడి నుండి అమెరికా వెళ్లిపోయారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉంటే, మోహన్ బాబు ఇటీవల దుబాయ్ వెళ్లి తన మనవడిని కూడా కలిసినట్లు చెబుతున్నారు. ముందస్తు బెయిల్ తిరస్కరణ తర్వాత అమెరికా వెళ్లినట్లు ఆ ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి. ఈ పరిణామాలపై మోహన్ బాబు ఎటువంటి ప్రకటన చేయకపోవడం వివాదాన్ని మరింత తీవ్రమయ్యేలా చేస్తోంది. ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తారా లేదా అనే విషయం తెలియజేసే వరకు ఈ చర్చలు కొనసాగుతూనే ఉంటాయి.