
మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య ఎప్పుడూ ఒక మంచి అనుబంధం ఉంది. చిరంజీవి, అల్లు అరవింద్‌ల బంధం ఎంతో గాఢమైనది. ఎలాంటి పరిస్థితుల్లోనూ వీరి మధ్య బంధం దెబ్బతినలేదు. అల్లు అరవింద్ అయితే మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీకి మధ్య వారధిగా ఉంటూ వచ్చాడు. అయితే ఇటీవల అల్లు అరవింద్ మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
ఇప్పటికే మెగా వర్సెస్ అల్లు అనే టాపిక్ నెట్టింట్లో ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. అల్లు అర్జున్ తన పుష్ప, పుష్ప 2 సినిమాలతో ఇంటర్నేషనల్ లెవెల్‌కు ఎదిగాడు. దాంతో బన్నీ ఫ్యాన్స్ మరింత రెచ్చిపోతున్నారు. మెగా హీరోలపై, ముఖ్యంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ మీద ట్రోలింగ్ ఎక్కువ అవుతోంది. ఈ ట్రోలింగ్ జరుగుతుండగా, అల్లు అరవింద్ రామ్ చరణ్ సినిమాల గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తోంది.
ఇటీవల తండేల్ ఈవెంట్‌లో దిల్ రాజును ఇంట్రడ్యూస్ చేస్తూ, గేమ్ ఛేంజర్ సినిమా స్థాయిని చేతి సైగలతో తగ్గించేశాడు. ఆ సందర్భంలో అసలు ఆ టాపిక్ అవసరం కూడా లేదు. కానీ అల్లు అరవింద్ గేమ్ ఛేంజర్ గురించి తక్కువగా ప్రస్తావించడం మెగా ఫ్యాన్స్‌కు కోపం తెప్పించింది. అంతేకాదు, రామ్ చరణ్ తొలి సినిమా చిరుత గురించి కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. చిరుత యావరేజ్ సినిమా అని మాట్లాడడం మెగా ఫ్యాన్స్‌ను మండి పడేలా చేసింది.
చిరుత సినిమా రిలీజ్ అయినప్పుడు మాస్ ప్రేక్షల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆ సమయంలో రామ్ చరణ్ కంటే ముందు వచ్చిన స్టార్స్ డెబ్యూ సినిమాలతో పోల్చుకుంటే, చిరుతనే అసలైన మాస్ డెబ్యూ అని చెప్పొచ్చు. ఆ సినిమా పెట్టిన బడ్జెట్‌కు మూడింతలు లాభాలను తెచ్చిపెట్టింది. దాదాపు 25 కోట్లకు పైగా షేర్ సాధించింది. ఆ రేంజ్‌లో విజయం సాధించిన సినిమా గురించి యావరేజ్ అని మాట్లాడడం తప్పే అని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
అంతేకాదు, మగధీర సినిమా తానే సెట్ చేశానని అల్లు అరవింద్ చెప్పిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. నిజానికి రామ్ చరణ్ మొదటి సినిమానే రాజమౌళి చేయాల్సి ఉంది. కానీ చిరంజీవి అడిగినప్పుడు రాజమౌళి, “మొదటి సినిమా అంటే చాలా అంచనాలు ఉంటాయి, నేను చేయలేను, రెండో సినిమాను చేస్తాను” అని చెప్పినట్లు తెలుస్తోంది. అలా మగధీర రెండో సినిమాగా తెరకెక్కింది. అల్లు అరవింద్ భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మించాడు. అయితే, “మగధీర హిట్ అవుతుందని కూడా ఊహించలేదు” అంటూ అల్లు అరవింద్ చెప్పడం మెగా ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచింది.
ఈ వ్యాఖ్యలతో నెట్టింట్లో మళ్లీ మెగా వర్సెస్ అల్లు టాపిక్ తెరపైకి వచ్చింది. మెగా ఫ్యాన్స్ చిరుత సినిమా, మగధీర విజయం గురించి లెక్కలు తీస్తూ అల్లు అరవింద్ వ్యాఖ్యలపై విమర్శలు చేస్తున్నారు. అల్లు అర్జున్ కెరీర్, డెబ్యూ సినిమాల ఫలితాలను మెగా హీరోల సినిమాలతో పోల్చుతూ పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు. చిరుత సినిమా విజయాన్ని తక్కువ చేసి చూపించడం సరైంది కాదని నెటిజన్లు కూడా అభిప్రాయపడుతున్నారు.