“భోళా శంకర్” డిజాస్టర్ తరువాత చిరంజీవి చాలా పట్టుదలతో మొదలుపెట్టిన. “విశ్వంభర” సినిమా మీద మెగా ఫ్యాన్స్ పెద్ద ఆశలు పెట్టుకున్నారు. ” బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సోషియో ఫాంటసీ అడ్వెంచర్ భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోంది. అసలే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావించినా, రామ్ చరణ్ “గేమ్ ఛేంజర్” కోసం వాయిదా వేయడం జరిగింది. అయితే ఇంకా మేకర్స్ సినిమా విడుదల తేదీని ప్రకటించలేదు.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేయాల్సి ఉండగా, మేకర్స్ సమ్మర్ సీజన్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. కానీ అప్పటికే వేసవి సీజన్‌కి అనేక పెద్ద సినిమాలు రిలీజ్ డేట్స్ లాక్ చేసుకోవడం విశ్వంభరకి ఛాలెంజ్‌గా మారింది. ఈ సీజన్ లో ‘హరి హర వీర మల్లు’, ‘ది రాజా సాబ్’, ‘కుబేర’, ‘మ్యాడ్ స్క్వేర్’, ‘కన్నప్ప’, ‘హిట్ 3’, ‘మాస్ జాతర’ వంటి పలు క్రేజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ పోటీ మధ్య విశ్వంభర ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.
ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం మేకర్స్ భారీ ధరను డిమాండ్ చేస్తుండటంతో, కొన్ని ప్రముఖ ఓటీటీ సంస్థలు ఆ రేటును సొంతం చేసుకోవడంలో వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ లాంటి ప్లాట్‌ఫామ్స్ ఈ సినిమాపై చూపిస్తున్న ఆసక్తి ప్రత్యేకంగా ఉంది. కానీ సమ్మర్ సీజన్ లో ఇప్పటికే చాలా ఓటీటీ స్లాట్లు బుక్ కావడంతో విశ్వంభర ఓటీటీ రిలీజ్ షెడ్యూల్‌ను కూడా ప్లాన్ చేయడం క్లిష్టంగా మారింది.
విశ్వంభర చిత్రాన్ని UV క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమాను వాయిదా వేయడం వల్ల అదనంగా వడ్డీ భారం పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాబట్టి, నాన్-థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీ మొత్తాన్ని రికవరీ చేయాల్సిన అవసరం మేకర్స్‌కు ఎదురవుతోంది. డిజిటల్ డీల్స్ ఇంకా ఫైనలైజ్ కాకపోవడం, థియేట్రికల్ రిలీజ్ డేట్స్ దానికి అనుగుణంగా ఫిక్స్ చేయాల్సి రావడం వంటి విషయాలు ప్రభావం చూపుతున్నాయి.
ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. చిరంజీవి సరసన త్రిష కృష్ణన్ నటిస్తుండగా, ఆషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా వంటి వారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండటంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మరి విశ్వంభర సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందో, ఎంత వరకు మెగా ఫ్యాన్స్ అంచనాలను అందుకుంటుందో వేచి చూడాల్సిందే.