Wednesday, September 22, 2021

ఎన్టీఆర్‌, సూపర్‌స్టార్ మధ్య ‘కురుక్షేత్రం’కు కారణమిదే..!

నందమూరి తారక రామారావు… తెలుగు సినిమా చరిత్రకు నిలువెత్తు నిదర్శనం. సూపర్‌స్టార్ కృష్ణ… తెలుగు సినిమా చరిత్రలో సాహసాలకు తిరుగులేని చిరునామా. వెండితెరపై తమదైన శాశ్వత ముద్రను వేసిన ఈ అగ్రహీరోల మధ్య చాలాకాలం మాటలు లేవనే విషయం ఈతరం ప్రేక్షకులకు తెలియదు. కృష్ణ నటించిన 125వ చిత్రం ‘కురుక్షేత్రం’ ఇందుకు కారణం కావడం విశేషం.

ఇక వివరాల్లోకి వెళితే ప్రఖ్యాత దర్శకులు, పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు దర్శకుడిగా ‘కురుక్షేత్రం’ చిత్రానికి నిర్మాత ఎ.ఎస్. ఆంజనేయులు గారు ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో కృష్ణను అర్జునుడి పాత్రకు ఎంపిక చేసుకున్నారు. సినిమా ప్రీ ప్రొడక్షన్‌లో ఉన్న సమయంలోనే ఎన్టీఆర్ కూడా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ‘దాన వీర శూర కర్ణ’ చిత్రానికి రూపకల్పన చేస్తున్నారు. ఈ చిత్ర నిర్మాత ఎన్టీఆర్‌ను కలిసి శ్రీకృష్ణుడి పాత్రను వేయమని కోరగా సొంత ప్రొడక్షన్ ఉన్న కారణంగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అప్పటికే ‘సంపూర్ణ రామాయణం’లో రాముడిగా నటించి మెప్పించిన శోభన్‌బాబును కృష్ణుడి పాత్రకు తీసుకున్నారు. ఇక నిర్మాణం మొదలు పెట్టడానికి సిద్ధమౌతున్న తరుణంలో తనను ఒకసారి వచ్చి కలవాలని ఎన్టీఆర్ నుంచి కృష్ణకు కబురొచ్చింది.

అన్నగారంటే అమితమైన అభిమానం ఉన్న కృష్ణ వెంటనే వెళ్లి ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా ‘‘దాన వీర శూర కర్ణ’ చిత్రం నా జీవిత లక్ష్యం. ఈ సమయంలో దీనికి పోటీగా ‘కురుక్షేత్రం’ చిత్రం తీయడం భావ్యం కాదు’’ అన్నారట. ఆయన మాటలు విన్న కృష్ణ ‘‘‘అన్నగారూ నాకూ ‘కురుక్షేత్రం’ ప్రొడక్షన్‌కు ఎటువంటి సంబంధంలేదు. నన్ను అర్జునుడి పాత్రకు మాత్రమే ఎంపిక చేసుకున్నారు. మీరు చెబుతున్నారు కాబట్టి నేను నిర్మాత ఆంజనేయులు గారితో మాట్లాడి ఒప్పించడానికి ప్రయత్నిస్తాను’’ అని చెప్పి వచ్చేశారు. అయితే అప్పటికే ఈ సినిమా కోసం పలు సెట్లు వేయడం, కాస్ట్యూవ్‌‌సు కుట్టించడం, ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌కు అడ్వాన్స్‌లు ఇవ్వడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బును ఖర్చు పెట్టి ఉండడం వల్ల నిర్మాత ఆంజనేయులు కృష్ణతో ‘‘నిన్ను నమ్ముకుని దిగాను. ఇప్పటికే అన్ని ఏరియాలూ కమిట్ అయి అడ్వాన్స్‌లు తీసుకున్నాను. ఇప్పుడు డ్రాప్ అవ్వమంటే ఎలా? చాలా నష్టపోతాను’’ అంటూ కృష్ణ విన్నపాన్ని త్రోసిపుచ్చారు.

నిర్మాతల కల్పతరువుగా పేరొందిన కృష్ణ తన వల్ల ఓ నిర్మాత నష్టపోవడాన్ని ఇష్టపడలేదు. అందుకే ధైర్యంగా ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి ‘‘అన్నగారు ‘కురుక్షేత్రం’ విషయంలో కావాలని చేసింది ఏమీ లేదు. అనుకోకుండా ఇలా జరిగింది. ఇప్పటికే నిర్మాత చాలా ఖర్చు పెట్టి ఉన్నారు. ఇప్పుడు ప్రొడక్షన్ ఆగిపోతే ఆయన ఆర్ధికంగా చాలా నష్టపోతారు. నా వల్ల ఓ నిర్మాత నష్ట పోవడం నాకు ఇష్టంలేదు’’ అంటూ తన మనసులోని మాటను నిష్కర్షగా చెప్పారు. దానికి అన్నగారు కొంచెం కోపంగా ‘‘అలా అయితే మీ ఇష్టం బ్రదర్’’ అని లోపలకు వెళ్లిపోయారు. ఇక రెండు సినిమాలూ శరవేగంగా షూటింగ్ చేసుకుంటున్న తరుణంలో మరో ఆసక్తికర సంఘటన జరిగింది.

‘కురుక్షేత్రం’కు సంబంధించిన నాలుగురీళ్ల పాటు సాగే క్లైమాక్స్ సన్నివేశాలను 5వేల మంది జనం, 50 ఏనుగులు, ఆరువందల గుర్రాలు, 200మందికి పైగా ఫైటర్లు, అందరు ఆర్టిస్ట్‌ల కాంబినేషన్‌లో 50 పేజీలకు పైగా టాకీని చిత్రీకరించడానికి జైపూర్‌లో భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. అక్కడ షూటింగ్ జరుతుండగానే నిర్మాత ఆంజనేయులు దగ్గర కేవలం పదిరోజుల పాటు షూటింగ్‌ను మాత్రం చేయడానికి సరిపడా డబ్బు ఉంది. కానీ అనుకున్న ప్రకారం చిత్రీకరణ జరపాలంటే 30 రోజులు పడుతుంది. ఈ దశలో నిర్మాత మొత్తం షూటింగ్‌ను కేవలం పది రోజుల్లో పూర్తి చేయాలనడంతో యూనిట్‌కు దిక్కుతోచలేదు.

దర్శకుడు కమలాకర కామేశ్వరరావు ఇలా హడావుడిగా షూటింగ్ చేయడం పట్ల విముఖత వ్యక్తం చేశారట. ఈ పరిస్థితుల్లో సినిమాని వదిలి తనదారిన తాను పోవడం ఇష్టలేని కృష్ణ ఆర్ధికంగా వెన్నుదన్నుగా నిలిచారు. దాంతో కృష్ణ సమర్పణలో ‘మాధవీ పద్మాలయా కంబైన్స్’ బ్యానర్‌పై సినిమా నిర్మాణం సాగింది. తనను కలిసిన సందర్భంలో ఈ సినిమా ప్రొడక్షన్‌తో తనకు ఎలాంటి సంబంధంలేదని చెప్పిన కృష్ణ తదనంతరం నిర్మాణంలో భాగస్వామి కావడంతో అన్నగారు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. అలా ‘కురుక్షేత్రం’ చిత్రం కృష్ణఎన్టీఆర్‌ల మధ్య ఓ చిన్నసైజు కురుక్షేత్రాన్ని సృష్టించింది.

Latest Articles