Saturday, April 17, 2021

వెన్నుపోటుపై జగన్‌కు లేఖ రాస్తా: రోజా




పదేళ్ల కష్టం.. అంతులేని అవమానాలు.. నా అనుకున్నవారే వెన్నుపోట్లు పొడవడం.. కష్టాలు.. కన్నీళ్లు అయినా కోల్పోని నిబ్బరం. ఇదీ నగరి ఎమ్మెల్యే ఆర్‌.కె. రోజా రాజకీయ జీవితం. 2014 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ టీడీపీ అధికారంలోకి రావడంతో ఆమెకు ఎమ్మెల్యే హోదా తనివితీరా అనుభవించే అవకాశం దక్కలేదు. మొత్తానికి 2019 ఎన్నికల్లో తాను రెండోసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. అదే సమయంలో తమ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. అయినా ఈ ఆనందం ఆమెకు ఎంతో కాలo నివలేదు.

స్వంత పార్టీలోనే ఆమెకు పోటీగా మరో వర్గం తయారైంది. దీనికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వం వహిస్తున్నారని ఇంతకు ముందు రోజా ఆరోపించారు. జిల్లాలోని ఇద్దరు మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణస్వామితో పాటు ఇతర ఎమ్మెల్యేలు సైతం ఓ వర్గంగా ఏర్పడి రోజాను ఏకాకిని చేస్తున్నారట. ఈ విషయం ఆమె స్వయంగా కన్నీళ్ల పర్యంతం అవుతూ ఇటీవల మీడియాకు వివరించారు.

వివాదాలకు తెర దించాలనే ఉద్దేశ్యంతో రోజానే ఓ అడుగు ముందుకేసి గత రాఖీ సందర్భంగా రోజా పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి రాఖీ కూడా కట్టింది. దీంతో పరిస్థితి సద్దుమణిగిందనే అందరూ అనుకున్నారు. కానీ మున్సిపల్‌ ఎన్నికల్లో రెబల్స్ పోటీ చేయడం పై రోజా సంచలన కామెంట్స్‌ చేశారు. తనకు ఇప్పటికీ వెన్నుపోటు దారుల బెడద పోలేదని, ఈ మున్సిపల్‌ ఎన్నికల్లో తన నియోజకవర్గంలో వైరి వర్గం కావాలనే రెబల్స్‌ను ప్రోత్సహించిందని, తద్వారా తనకు అధిష్ఠానం వద్ద చెడ్డ పేరు తేవటానికి చూస్తున్నారని అన్నారు.

ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టనని, దీనిపై ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాస్తానని కూడా తెలిపారు. మొత్తానికి రాఖీతో రాజీకి వచ్చినా తనను మాత్రం వారు ఇంకా శత్రువుగానే చూస్తున్నారనే విధంగా ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.




Related Articles

Latest Articles