Wednesday, September 22, 2021

మణిరత్నం`మోహన్‌బాబు చారిత్రక చిత్రం

మణిరత్నం.. భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ముందు వరుసలో ఉండే వ్యక్తి. 1983లో ‘పల్లవి అనుపల్లవి ’ అనే కన్నడ సినిమాతో దర్శకుడిగా కెరీర్‌ ప్రారంభించిన ఆయన ‘ఉన్నారు’, ‘పగల్‌ నిగళ్‌’, ‘ఇదయ కోవిళ్‌’ చిత్రాలతో తనలోని సృజనాత్మకతను చాటుకున్నారు. ఆయన దర్శకత్వంలో 1986లో వచ్చిన ‘మౌనరాగం’ చిత్రం అద్భుతమైన విజయం సాధించడంతో దర్శకుడిగా తన జైత్రయాత్రను మొదలు పెట్టారు. ఈ చిత్రం తెలుగు లో కూడా పలు చోట్ల 100 రోజు ప్రదర్శించబడింది. ఆ వెంటనే 1987లో వచ్చిన ‘నాయకన్‌’ తెలుగులో ‘నాయకుడు’ సూపర్‌డూపర్‌హిట్‌ అవటంతో దేశమంతటా మణిరత్నం పేరు మారుమ్రోగింది.

ఆ వెంటనే వచ్చిన ‘అగ్ని నక్షత్రం’ తెలుగులో ‘ఘర్షణ’, తెలుగు డైరెక్ట్‌ సినిమా ‘గీతాంజలి’, రజనీ`మమ్ముట్టి ‘దళపతి’ దక్షిణాది చిత్ర పరిశ్రమలో మణిరత్నంకు ఎనలేని పేరు, ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. 1992లో వచ్చిన ‘రోజా’ చిత్రం ఆయన్ను జాతీయ దర్శకుల జాబితాలో చేర్చింది. ‘రోజా’ చిత్రం నుంచి ఆయన దాదాపుగా నేషనల్‌ లెవల్‌ సబ్జెక్ట్‌నే ఎంచుకుంటున్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన సినిమాకు ఓ ప్రత్యేకమైన ప్రేక్షక వర్గం ఎప్పుడూ రెడీగా ఉంటుంది.

తాజాగా మణిరత్నం మరో సంచలన చిత్రానికి తెరలేపుతున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో ఓ చారిత్రక చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. కల్కి అనే తమిళ రచయిత రాసిన ‘పొన్నియన్‌ స్వెన్‌’ అనే నవల ఆధారంగా ఈసినిమా తెరకెక్కనుంది. కోలీవుడ్‌, టాలీవుడ్‌, బాలీవుడ్‌ నటీనటులు ఇందులో నటించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు మోహన్‌బాబును సెక్ట్‌ చేశారు మణిరత్నం. థాయ్‌లాండ్‌ దేశంలోని దట్టమైన అడవుల్లో ఏకథాటిగా 4 నెలల పాటు ఈ సినిమా షెడ్యూల్‌ జరగనుంది.

ఈ సినిమా కోసం ఏ.ఆర్‌. రెహమాన్‌ 12 పాటలను రెడీ చేస్తున్నారట. మణి స్వంత బ్యానర్‌ మద్రాస్‌ టాకీస్‌తో పాటు రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని షాకింగ్‌ బడ్జెట్‌తో రూపొందిస్తున్నాయి. అమితాబ్‌, ఐశ్వర్యారాయ్‌, మోహన్‌బాబు, జయం రవి, విక్రమ్‌, అనుష్క, కీర్తి సురేష్‌, విజయ్‌ సేతుపతి, ఉత్తరాది, దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటులు ఇందులో నటించనున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే బాహుబలి రికార్డును మణిరత్నం తుచిడిపెట్టేయడం ఖాయం.

Latest Articles