హీరోగా రీ ఎంట్రీ ఇవ్వనున్న మ్యూజిక్ డైరెక్టర్

0

టాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యంత బిజీగా ఉన్న సంగీత దర్శకుడిగా తమన్‌ పేరు ముందు వరుసలో వినిపిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్‌ స్థాయిలో తమన్‌ కూడా తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకున్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలకు సంగీతం అందించి, వరుస విజయాలు అందుకున్న సంగీత దర్శకుడిగా ఆయన నిలిచారు. టాలీవుడ్‌లోని స్టార్ హీరోలందరి సినిమాలకు తమన్‌ సంగీతాన్ని అందించి హిట్‌ కొట్టడం విశేషం. కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్‌లో కూడా తమన్‌ మంచి పేరు తెచ్చుకున్నారు. తమిళ స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందిస్తూ అక్కడ కూడా స్టార్ మ్యూజిక్ కంపోజర్‌గా గుర్తింపు పొందారు. అంతేకాకుండా హిందీ చిత్రసీమలో కూడా తమన్‌ తన మార్క్‌ను చూపించారు.

యాక్షన్‌ సినిమాలకు అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ అందిస్తాడనే పేరున్న తమన్‌ ఇటీవల ‘డాకు మహారాజ్‌’ సినిమాతో మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నారు. బాలకృష్ణ నటించిన ఈ చిత్రంలో ఎలివేషన్‌ సీన్స్‌కు ఆయన అందించిన సంగీతం సినిమాకు మరింత బలాన్నిచ్చింది. గతంలోనూ బాలకృష్ణ సినిమాలకు తమన్‌ సంగీతాన్ని అందించి హిట్‌ అందుకున్నారు. ఇప్పుడు ‘అఖండ 2’ కోసం మరోసారి తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. చేతిలో ఎప్పుడూ అర డజనుకు పైగా సినిమాలు ఉండే తమన్‌ ఇప్పుడు సంగీత దర్శకుడిగా మాత్రమే కాకుండా, నటుడిగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.

తమన్‌ సంగీత దర్శకుడిగా మారకముందు శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘బాయ్స్‌’ సినిమాలో నటించారు. దాదాపు 23 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాలో నలుగురు హీరోలలో ఒకరిగా కనిపించిన తమన్‌ అప్పట్లో నటనలో ఆసక్తి చూపించినప్పటికీ, తరువాత సంగీతంలో స్థిరపడ్డారు. అయితే, ఇప్పుడు మళ్లీ ఆయన నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తమిళ యువ హీరో అథర్వ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ఓ సినిమాలో తమన్‌ మరో కీలక పాత్రలో నటించబోతున్నారని సమాచారం. కథ, తన పాత్ర నచ్చడంతో తమన్‌ కూడా ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చినట్లు తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి.

సంగీత దర్శకులు నటించడం టాలీవుడ్‌, కోలీవుడ్‌లో కొత్తేం కాదు. గతంలో ఆర్పీ పట్నాయక్‌ హీరోగా కొన్ని సినిమాలు చేశారు. అంతకు మునుపు కూడా పలువురు సంగీత దర్శకులు వెండితెరపై కనిపించారు. ఈ మధ్య కాలంలో జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీత దర్శకుడిగా వరుస సినిమాలు చేస్తూనే, హీరోగా కూడా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదే బాటలో తమన్‌ కూడా హీరోగా వరుస సినిమాలు చేయనున్నారా? లేదా ఒక్కట్రెండే చేసి మళ్లీ సంగీతానికే పరిమితమవుతారా? అన్నది చూడాల్సిన విషయంలో. అథర్వతో కలిసి చేస్తున్న సినిమా గురించి త్వరలో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నటుడిగా తమన్‌ సక్సెస్‌ అయితే, ఆయన కెరీర్‌ కొత్త మలుపు తిరిగే అవకాశం కూడా లేకపోలేదు.