
తండేల్ సినిమా నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం. కార్తికేయ 2 తర్వాత చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో బన్నీ వాసు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మించాడు. సినిమా విడుదలకు ముందు నుంచే మంచి హైప్ ఏర్పడింది.
ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది సాయి పల్లవి. ఆమెకు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. చాలా రోజుల తర్వాత ఆమె నుంచి వస్తున్న స్ట్రయిట్ తెలుగు సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గతంలో విరాట పర్వం సినిమాలో మెప్పించిన ఆమె, ఇప్పుడు తండేల్‌లో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది.
ఈ సినిమా కథ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లి అనుకోకుండా పాకిస్తాన్ హద్దులు దాటి అక్కడి సైనికులకు చిక్కిపోతారు. ఆ తర్వాత పాక్ జైల్లో చిత్రహింసలు అనుభవిస్తారు. దేశభక్తి, ప్రేమకథ కలిసిన ఈ కథ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇక నాగ చైతన్య లుక్, మేకోవర్ కూడా సినిమాకు హైలైట్‌గా మారాయి. ఈ సినిమాకోసం ఆయన ఎంతో హార్డ్ వర్క్ చేశారు. పోస్టర్లను చూస్తేనే ఆయన పాత్రకు ఎంతగా ఇంటెన్సిటీ ఇచ్చాడో తెలుస్తోంది. తండేల్ కోసం చైతన్య చాలా హోమ్ వర్క్ చేయడం, పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం స్పష్టంగా కనిపిస్తోంది.
నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ కూడా సినిమాపై హైప్ పెంచే మరో అంశం. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన లవ్ స్టోరీ మంచి విజయం సాధించడంతో ఇప్పుడు తండేల్ కూడా పెద్ద హిట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. టీజర్, ట్రైలర్ చూస్తేనే వీరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని అర్థమవుతోంది. ప్రేక్షకులు కూడా వీరి జంటను మరోసారి వెండితెరపై చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇంకా ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం మరో ప్లస్ పాయింట్. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు కూడా చార్ట్‌బస్టర్లుగా నిలిచాయి. బుజ్జి తల్లి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే రీసెంట్‌గా విడుదలైన హైలెస్సో హైలెస్సా సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు బలాన్ని ఇచ్చేలా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది.
ఇన్ని ప్లస్ పాయింట్లతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తండేల్ నాగ చైతన్య కెరీర్‌లో మరొక హిట్ సినిమాగా నిలుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.