
నాగచైతన్య, సాయిపల్లవి కాంబోలో’తండేల్’ సినిమా ఒక ప్రత్యేకమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, సినిమా మొత్తం ఒకే లైన్లో నడవలేకపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా, ఇంటర్వెల్ వరకు సాగిన ప్రేమకథ మంచి ఎమోషన్‌తో ఆకట్టుకున్నప్పటికీ, ఆ తర్వాత కథ మళ్లీ వేరే మలుపు తిరగడం, పాకిస్థాన్ ఎపిసోడ్ ఓవర్ ద టాప్ స్టైల్లో సాగడం ప్రేక్షకులను పూర్తిగా కనెక్ట్ అయ్యేలా చేయలేకపోయింది. ఇంటర్వెల్ వరకు కథను ఆసక్తికరంగా నడిపించిన దర్శకుడు, ఆ తర్వాత విషయంలో కొంత ప్లానింగ్ మిస్సైనట్లు అనిపిస్తుంది.
పాకిస్థాన్ ఎపిసోడ్‌ను మాస్ ప్రేక్షకులను ఆకర్షించేలా డిజైన్ చేసినప్పటికీ, అది అంతగా వర్కవుట్ కాలేదు. హీరో-హీరోయిన్ మధ్య ఉండే భావోద్వేగాలు మొదట్లో బలంగా ఉండగా, కథ లోతుగా వెళ్లే కొద్దీ ఆ ఎమోషన్ తగ్గిపోవడం కొంత నిరాశ కలిగించే అంశం. కథలో మధ్యలో వచ్చే బ్రేకుల కారణంగా ఎక్కడా పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యే స్థితి కలగడం లేదు. ముఖ్యంగా, హీరో-హీరోయిన్ ఎడబాటులో వచ్చే భావోద్వేగ దృశ్యాలు మరింత బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. సాయిపల్లవి లాంటి నటిని కలిగి ఉన్నా, ఆమె పాత్రకు ఎక్కువ బలం ఇచ్చి ఉంటే ప్రేక్షకుల హృదయాలను మరింతగా తాకేలా ఉండేది.
అయితే, సినిమా ముగింపు దశలో మళ్లీ కాస్త బెటర్ ఫీలింగ్ కలిగించేలా మారుతుంది. ముఖ్యంగా, హీరో బృందం విడుదలయ్యే దశలో వచ్చే మలుపు కథను కొంత ఆసక్తికరంగా మార్చింది. చివరి సన్నివేశాలు పర్వాలేదనిపించినా, మొత్తం మీద మధ్యలో సినిమా ఫ్లో లోపించిందనిపించేలా ఉంది. అయితే, ప్రేమకథలను ఇష్టపడే వారికి మాత్రం ‘తండేల్’ ఓ మంచి ఆప్షన్ అనిపించవచ్చు.
నాగ చైతన్య – సాయిపల్లవి జోడీ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ. ఇద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా పనిచేసింది. చైతూ తన పాత్రకు తగ్గట్లుగా పూర్తిగా కొత్త మేకోవర్‌ను అంగీకరించాడు. బాడీ లాంగ్వేజ్, యాస, నటన అన్నింటిలోనూ మార్పు కనపడింది. ఎక్కడా ఓవర్ యాక్టింగ్ లేకుండా సహజంగా నటించేశాడు. సాయిపల్లవి ఎప్పటిలాగే తన సహజ అభినయంతో ఆకట్టుకుంది. ఆమె ప్రేమించేప్పుడు పులకింత కలిగిస్తుంది, బాధపడేప్పుడు మనసును కదిలిస్తుంది. అయితే, రెండో భాగంలో ఆమె పాత్రను మరింతగా హైలైట్ చేసి ఉంటే సినిమా స్థాయి పెరిగేది.
సాంకేతికంగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం హైలైట్‌గా నిలిచింది. ‘బుజ్జితల్లీ’ ‘హైలెస్సో’ పాటలు చాలా బాగా వచ్చాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఛాయాగ్రహణం రిచ్‌గా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు కూడా సినిమాకు మంచి లుక్ ఇచ్చాయి. దర్శకుడు చందూ మొండేటి స్క్రీన్‌ప్లే విషయంలో కొంత లోపించాడనిపించినా, శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌ను మాత్రం అథెంటిక్‌గా చూపించాడు. మొత్తంగా, కొన్ని లోపాలున్నప్పటికీ ‘తండేల్’ చూడదగ్గ ప్రేమకథే. రొటీన్ లవ్ స్టోరీల నుంచి కాస్త భిన్నంగా అనిపించే ప్రయత్నం చేసిందని చెప్పొచ్చు.
రేటింగ్: 3/5