నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్ పరంగా, వ్యక్తిగత జీవితంలో ఒక మహర్దశను అనుభవిస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఈ సంక్రాంతికి వరుసగా నాలుగో హిట్ అందుకున్న ఆయన, ఇటీవల పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక కావడం మరో ఘనత. బాలయ్య బుల్లితెరపై ‘అన్‌స్టాపబుల్’ అనే టాక్ షోతో కూడా విజయవంతంగా దూసుకుపోతున్నారు. రాజకీయంగా చూస్తే, హిందూపురం ఎమ్మెల్యేగా మూడోసారి ఎన్నికై తన ప్రజాసేవను కొనసాగిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే, ప్రస్తుతం బాలయ్య పట్టిందల్లా బంగారం అవుతున్నట్లే.
ఇటీవల బాలకృష్ణ తన కెరీర్లో కొత్త మార్పులు తీసుకువచ్చారు. యంగ్ డైరెక్టర్లతో కలిసి పనిచేయడం వల్ల వరుస విజయాలు దక్కించుకుంటున్నారు. ఇది ఆయన కెరీర్‌కు మరో మలుపు తిప్పిన అంశం. బాలయ్య సినిమాల్లో మాత్రమే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని ప్రత్యేకమైన అలవాట్లను పాటిస్తారు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా, షూటింగ్ ఎంత రాత్రి వరకు సాగినా, ప్రతి రోజూ ఉదయం 3.30 గంటలకు నిద్రలేవడం ఆయన అలవాటు. లేవగానే భూమాతకు నమస్కరించి, తన పనులను ప్రారంభిస్తారు. ఆ తర్వాత స్నానం చేసి, సూర్యోదయానికి ముందే పూజ చేసుకుంటారు. భగవంతుడి కోసం సమయం కేటాయించడం ద్వారా మనిషి తన కోసం సమయం కేటాయించుకున్నట్లే అని బాలయ్య నమ్ముతారు. అందుకే ప్రతిరోజూ ఏం జరిగినా తన మార్నింగ్ షెడ్యూల్ మార్చుకోరు.
తెలుగు పద్యాల మీద బాలకృష్ణకు మంచి ఆసక్తి ఉంది. చిన్నతనం నుంచే ఆయన ప్రత్యేకంగా తెలుగు మాస్టర్ దగ్గర శిక్షణ తీసుకుని తన భాషా పరిజ్ఞానాన్ని పెంచుకున్నారు. అలాగే సంస్కృతంపై కూడా మంచి పట్టుంది. టాలీవుడ్లో ఈ రకమైన ప్రతిభ కలిగిన అతి కొద్దిమంది హీరోల్లో బాలయ్య ఒకరు. ఆయన కెరీర్లో మాస్ ఇమేజ్ తెచ్చిన చిత్రాల్లో ‘రౌడీ ఇన్స్పెక్టర్’ ఒకటి. అయితే, తాను ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించినా ‘సమరసింహా రెడ్డి’ సినిమాకు మాత్రం ప్రత్యేక స్థానం ఉంది. ఇది తన ఫేవరెట్ మూవీ అని చాలా సందర్భాల్లో పేర్కొన్నారు.
నంబర్ల పరంగా బాలకృష్ణకు 9 నంబర్ ఎక్కువగా కలిసివస్తుందనే అభిప్రాయం ఉంది. ఆహారం విషయంలో ఆయనకు ఎలాంటి నియమాలు లేవు. అన్నీ తినడం ఇష్టపడతారు. అయితే, అవసరమైతే సినిమా కోసం స్వల్పంగా డైట్ మార్పులు చేసుకుంటారు. ప్రస్తుతం బాలకృష్ణ ‘అఖండ 2’లో నటిస్తున్నారు. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ‘అఖండ’ చిత్రాన్ని మించి బాలయ్య మరో సూపర్ హిట్ అందుకోవచ్చని అభిమానులు నమ్ముతున్నారు. బాలకృష్ణ కెరీర్ పరంగా కూడా మరిన్ని విజయాలు సాధించాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.