
జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోయే ఎన్టీఆర్ 31 సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగినప్పటికీ, ఇప్పటివరకు సెట్స్ మీదకు వెళ్లలేదు. దీని ప్రధాన కారణం ఎన్టీఆర్ గత ఏడాది ‘దేవర’ సినిమాతో బిజీగా ఉండటం. ఆ సినిమా విడుదలైన తర్వాత బాలీవుడ్లో ‘వార్ 2’ మూవీలో హృతిక్ రోషన్‌తో కలిసి నటించేందుకు బిజీ అయిపోయారు. ప్రస్తుతం ‘వార్ 2’ షూటింగ్లో ఉన్న కారణంగా, ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాకి డేట్స్ కేటాయించలేకపోయారు. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఈ ఏడాది చివరికి లేదా ఫిబ్రవరి నెలాఖరులో సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, టెక్నీషియన్ల పేర్లు చర్చలో ఉన్నాయి. ముఖ్యంగా హీరోయిన్ విషయంలో కన్నడ నటి రుక్మిణి వసంత్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆమె పేరు మీడియాలో ప్రచారంలోకి వచ్చినప్పటి నుండి ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రుక్మిణి వసంత్ కన్నడ చిత్రసీమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. ఇక ఈ సినిమాకు సంగీతాన్ని రవి బస్రూర్ అందించనుండగా, కెమెరామెన్‌గా భువన్ గౌడ, ఎడిటింగ్ బాధ్యతలను ఉజ్వల్ కులకర్ణి చూసుకోనున్నారని సమాచారం. అలాగే స్టంట్ కొరియోగ్రఫీ కోసం చేతన్ డిసౌజా, ఆర్ట్ డైరెక్టర్‌గా టియల్ వెంకట ఛలపతిలు పనిచేయనున్నారు.
అంతేకాదు, ఈ చిత్రంలో మలయాళ నటులు బిజూ మీనన్, టోవినో థామస్‌లు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న కొంతమంది తెలుగు ప్రేక్షకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సినిమా కోసం ఎక్కువగా కన్నడ, మలయాళ పరిశ్రమలకు చెందిన నటీనటులు, టెక్నీషియన్లను ఎంపిక చేయడం తెలుగు ఇండస్ట్రీకి అన్యాయంగా భావిస్తున్నారు. అయితే, ఇది ఇంకా ఫైనల్ లిస్ట్ కాదని, అధికారిక ప్రకటన వచ్చే వరకు ఓపిక పట్టాలని ఎన్టీఆర్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఇక ‘దేవర’ సినిమా రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ‘దేవర’కు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇది ఎన్టీఆర్ స్టార్ పవర్‌కు నిదర్శనం. ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ మూవీ ఫిబ్రవరి చివరిలో సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉందని సమాచారం. ఇంకా చిత్రయూనిట్ అధికారికంగా ఈ విషయంపై ప్రకటన చేయాల్సి ఉంది. ఒకసారి షూటింగ్ మొదలైతే, సినిమా కథ, పాత్రల వివరాలు మరింత స్పష్టంగా బయటకు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా, ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి.