ఓటీటీ లో సినిమాలు చూడడానికి ఆడియన్స్ ఎక్కువ మక్కువ చూపడంతో సదరు సంస్థలు కూడా ఎప్పటికప్పుడు సరికొత్త చిత్రాలు, వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ఆన్లైన్ స్ట్రీమింగ్ కి వచ్చింది. కిషోర్, కని తిరు, కృష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్ అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటుంది.
ఈ సిరీస్ తెలుగుతో పాటుగా తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో అందుబాటులో ఉంది. గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తూ తన కుటుంబాన్ని పోషించే మధ్యతరగతి తండ్రి షణ్ముగం చుట్టూ తిరిగే కతే ఈ పారాచూట్ అనే వెబ్ సిరీస్. అతని భార్య లక్ష్మి అతనికి చేదోడు వాదోడుగా ఉంటుంది. షణ్ముగం.. తన ఇద్దరు పిల్లలు వరుణ్, రుద్రకు మెరుగైన జీవితం అందించాలి అనే ఉద్దేశంతో తాహతకు మించి పెద్ద స్కూల్లో చదివిస్తుంటాడు.
అయితే బయట ఎదుర్కొనే అవమానాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతను కాస్త కఠినంగా మారుతాడు. అందుకే వరుణ్ కి అతని తండ్రిని చూస్తే ఎక్కడ లేని భయం. తండ్రి నడిపే మోపెడుకు వరుణ్ ముద్దుగా పారాచూట్ అని పేరు కూడా పెట్టుకుంటాడు.. అది ఎప్పటికైనా నడపాలి అనేది అతని కల. ఒకరోజు అనుకోకుండా రుద్రను బయటకు తీసుకువెళ్లడానికి వరుణ్ తండ్రి పారాచూట్ ని ఉపయోగిస్తాడు. అయితే అది సడన్గా అదృశ్యం అవుతుంది.
మరో పక్క అదే సమయానికి కృష్ణ అనే ఒక ట్రాఫిక్ పోలీస్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒక యువకుడి బండిని సీజ్ చేస్తాడు. అసలు పారాచూట్ ఎక్కడికి వెళ్ళింది? పిల్లలు ఇంటికి ఎందుకు తిరిగి రాలేదు? షణ్ముఖం పిల్లలను ఎలా వెతికి పట్టుకున్నాడు? అనే అంశాల చుట్టూ ఈ స్టోరీ ఉత్కంఠంగా సాగుతుంది.
ఫ్యామిలీ మొత్తం తో కలిసి చూడదగిన ఓ మంచి వెబ్ సిరీస్ గా పారాచూట్ ను చెప్పుకోవచ్చు. కుటుంబ విలువలతో పాటు, తల్లిదండ్రులు అతి గారాబం చేసిన.. మరి దండించిన పిల్లలపై దాని ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా ఈ వెబ్ సిరీస్ కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. ఈ స్టోరీ సాధారణంగా కుటుంబంలో జరిగే ఎన్నో విషయాలను అద్భుతంగా ఆవిష్కరించింది. 5 ఎపిసోడ్లతో ఉన్న పారాచూట్ వెబ్ సిరీస్ నవంబర్ 29 నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.