కొద్ది రోజుల క్రితం భారత నూతన పార్లమెంట్లో జరిగిన అలజడి అందరికీ తెలిసిందే. పార్లమెంట్ సెషన్స్ జరుగుతుండగా లాబీల్లోంచి ఇద్దరు వ్యక్తులు హాల్లోకి దూకి కలకలం సృష్టించారు. పొగను సృష్టించే పదార్థాలను కూడా ఓపెన్ చేయడంతో ఎంపీలు అందరూ పరుగులు పెట్టారు.
ఇదే సమయంలో పార్లమెంట్ భవనం వెలుపల కొందరు ఇదే రీతిలో రంగుల రంగుల పొగ బాంబులను ఉపయోగించారు. విచారణ సమయంలో వీరు తమ నిరసన గళాన్ని దేశవ్యాప్తంగా వినిపించాలనే ఉద్దేశంతో ఇలా చేసినట్లు చెప్పారు.
ఈ విషయం ఇలా ఉంచితే పార్లమెంట్‌లోకి అసలు వీరు ఎలా ఎంటర్ అయ్యారు అనే విషయాన్ని దర్యాప్తు చేస్తున్న అధికారులకు మైసూర్‌కు చెందిన బీజేపీ ఎంపీ లెటర్ ద్వారా వీరికి పాస్‌లు జారీ అయినట్లు గుర్తించారు.
దీంతో ఆరోజు విజిటర్స్‌కు సంబంధించిన కూపీ లాగడం మొదలెట్టగా ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేటకు చెందిన నూకల సాంబశివరావు అనే రౌడీ షీటర్ దగ్గరకు వచ్చి ఆగింది. ఈనెల 8న ఇతడికి పార్లమెంట్‌లోకి ప్రవేశించటానికి పాస్‌లు దొరికినట్లు వెల్లడైంది.
ఇవి ఏకంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి నుంచి జారీ అయ్యాయట. ఇప్పుడు ఈ విషయం ఆంధ్రప్రదేశ్‌ను ఉలిక్కిపడేలా చేస్తోంది. సదరు రౌడీ షీటర్‌పై జగ్గయ్యపేటతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయి ఉన్నట్లు తేలింది.
అప్రమత్తమైన కేంద్ర నిఘా వర్గాలు సాంబశివరావును అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అసలు ఒక రౌడీ షీటర్‌కు పార్లమెంట్‌లోకి ప్రవేశించటానికి అనుమతి ఎలా వచ్చింది?
దానికితోడు ఏకంగా న్యాయశాఖామంత్రి కార్యాలయం నుంచి ఇతను పాస్‌ను ఎలా సంపాదించాడు అన్నదానిపై విచారణ జరుగుతోంది. ఆరోజు పార్లమెంట్‌పై జరిగిన దాడిలో ఇతని ప్రమేయం ఏమన్నా ఉందా అన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నారట.