
టాలీవుడ్లో ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ ఆధ్వర్యంలో ‘ఎన్టీఆర్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్’ కార్యక్రమం గ్రాండ్‌గా జరుగనుంది. ఈ మ్యూజికల్ షో ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రజల ఆరోగ్యం, సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 28 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈ ప్రత్యేకమైన మ్యూజికల్ నైట్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఈ షో టికెట్లు బుక్ మై షోలో అందుబాటులో ఉంటాయని, టికెట్ కొని ఈ మంచి పని కోసం ప్రజలు డొనేట్ చేయాలని భువనేశ్వరి కోరారు.
గ్రామీణ ప్రాంతాల్లో తలసేమియా లాంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి వైద్యం అందించడమే తమ లక్ష్యమని ఆమె వెల్లడించారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ముఖ్య అతిథిగా ఆహ్వానించామని, ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అంగీకరించారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్‌ను కూడా ఆహ్వానించనున్నామని చెప్పారు. అయితే, కార్యక్రమానికి ఎవరు వచ్చినా బుక్ మై షో ద్వారా టికెట్ కొనుగోలు చేసి రావాల్సిందేనని, అదే విధంగా డొనేషన్ ఇవ్వడం ద్వారా ఈ సేవా కార్యక్రమంలో సహకరించాలని భువనేశ్వరి సూచించారు.
ఇక నందమూరి బాలకృష్ణను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారా అనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ, ప్రతి ఒక్కరూ టికెట్ కొనుగోలు చేసి రావచ్చని, బాలకృష్ణ గారితో సహా అందరికీ ఇదే నిబంధన వర్తిస్తుందని స్పష్టత ఇచ్చారు. ఈ మ్యూజికల్ నైట్ కోసం తమన్ ఒక భారీ టీమ్‌తో పనిచేస్తున్నట్లు తెలిపారు. తన కెరీర్లో ఇదే అతిపెద్ద కాన్సర్ట్ అని తమన్ చెప్పారు. తలసేమియా గురించి మాట్లాడుతూ, ఇది ఒక జన్యు సంబంధ రక్త వ్యాధి అని, దీనికి వైద్యం లేకపోయినా రక్త మార్పిడి ద్వారా చికిత్స అందించవచ్చని భువనేశ్వరి వివరించారు.
సంజీవని క్లినిక్స్ ప్రారంభించామని, రూరల్ ఏరియాల్లో వైద్య సదుపాయాలు లేని ప్రాంతాలకు వెళ్ళి ప్రజలకు వైద్య సేవలు అందించే కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. తలసేమియా, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులపై అవగాహన పెంచే పనిని ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరి సహకారం చాలా ముఖ్యమని, బుక్ మై షో ద్వారా టికెట్లు తీసుకుని, కుటుంబ సమేతంగా విచ్చేసి, ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భువనేశ్వరి కోరారు. టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం విద్య, ఆరోగ్యం, బ్లడ్ బ్యాంక్ వంటి సేవా కార్యక్రమాలకు వినియోగించబడుతుందని చెప్పారు. ఎస్.ఎస్. తమన్ సహకారం అభినందనీయమని ఆమె ధన్యవాదాలు తెలిపారు.