
దుబాయ్‌లో జరుగుతున్న 24 హెచ్ కారు రేసింగ్‌లో భారత దేశానికే గర్వకారణంగా నిలిచిన అజిత్ కుమార్ టీం తమ ప్రతిభను చాటుకుంది. తమిళ స్టార్ హీరో అజిత్ ‘అజిత్ కుమార్ రేసింగ్’ పేరుతో తన టీంను ఈ ప్రతిష్టాత్మక రేసింగ్‌లో ప్రవేశపెట్టారు. రేస్ ప్రారంభానికి ముందు, అజిత్ రెడీ అవుతుండగా జరిగిన యాక్సిడెంట్ కారణంగా జట్టు ప్రదర్శనపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఈ అన్నీ ఒత్తిళ్లను అధిగమించి, అజిత్ టీం మూడో స్థానంలో నిలిచి భారత జాతీయ జెండాను అంతర్జాతీయ వేదికపై ఎగరవేసింది.
అజిత్ టీం విజయం అందరికీ ప్రేరణగా నిలిచింది. కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, ఉదయనిధి స్టాలిన్, సమంతతో పాటు పలువురు ప్రముఖులు అజిత్ టీంకి అభినందనలు తెలిపారు. రజనీకాంత్ “నువ్వు సాధించావు, ఐ లవ్ యూ” అంటూ ట్వీట్ చేయగా, కమల్ హాసన్ “దేశం గర్వపడేలా మీరు విజయాన్ని సాధించారు. మీ జట్టుకు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను” అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
టాలీవుడ్ నుంచి కూడా అజిత్ విజయానికి అభినందనలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సోషల్ మీడియా ద్వారా అజిత్ టీంకి అభినందనలు తెలిపారు. “గొప్ప సంకల్పంతో అంతర్జాతీయ వేదికపై భారత జెండాను ఎగరవేయడం నిజంగా స్ఫూర్తిదాయకం. మీ జట్టు మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ పవన్ ట్వీట్ చేశారు. సాధారణంగా ఇతర నటుల విజయాల గురించి పవన్ స్పందించడమే అరుదు. ఈ సందర్భంగా చేసిన ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షించింది.
అజిత్ టీం తొలిసారిగా 24 హెచ్ కారు రేసింగ్‌లో పాల్గొన్నప్పటికీ, అనుభవం లేకుండా ఈ స్థాయిలో ప్రదర్శన చూపించడం ప్రశంసనీయమైన విషయం. ఈ విజయంతో అజిత్ తన రేసింగ్ ప్రాముఖ్యతను నిరూపించారు. నటనలోనే కాకుండా క్రీడా రంగంలోనూ తన ప్రతిభను చూపి దేశానికే గర్వకారణంగా నిలిచారు.
సమంత, “కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అని మీరు చూపించారు. మీరు నిజమైన స్ఫూర్తిదాయకం” అంటూ వ్యాఖ్యానించారు. ఇలా అజిత్ సాధించిన విజయం కోలీవుడ్, టాలీవుడ్, ఇతర పరిశ్రమల నుంచే కాకుండా అభిమానుల హృదయాలను కూడా గెలుచుకుంది.