తెలంగాణలో ఎన్నికలు పూర్తవడంతో ఇప్పుడు మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి బాగా రాజుకుంది. మరో 100 రోజుల లోపు ఎన్నికలు జరిగే అవకాశం ఉండడం, దీనికితోడు తెలంగాణలాగా అసెంబ్లీ ఎన్నికలు,
పార్లమెంట్ ఎన్నికలు విడివిడిగా కాకుండా ఒకేసారి జరుగుతాయి కాబట్టి ఇటు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు అటు పార్లమెంట్ నియోజవకర్గాలపై కూడా పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది.
కాబట్టి అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీGజనసేన కూటమి అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్నాయి.
జనసేన అధినాయకుడు పవన్ కల్యాణ్ 27, 28, 29 తేదీల్లో కాకినాడలో మకాం వేయనున్నారు.
వైసీపీకి ఎమ్మెల్సీ గుడ్‌బై.. పవన్‌తో చర్చలు
ఈ సందర్భంగా తమ పార్టీకి సంబంధించి పొత్తులు ఖరారు కాబోయే స్థానాల గురించి, పార్టీలోకి కొత్తగా వచ్చేవారి విషయంలో నిర్ణయం తీసుకోవడం, చేరికల కార్యక్రమం నిర్వహించడం వంటి ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మరీ ముఖ్యంగా ఈసారి గోదావరి జిల్లాల వరకూ ఎక్కువ భాగం బాధ్యతను చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్‌ను విడిచిపెట్టినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. లోకేష్ ఉత్తరాంధ్రను, చంద్రబాబు రాయలసీమను, మిగిలిన కోస్తా జిల్లాలను చుట్టేలా ప్లాన్ చేస్తున్నారు.
గోదావరి జిల్లాల్లో పవన్‌కు అభిమానగణంతో పాటు సామాజిక వర్గ సపోర్ట్ కూడా ఈసారి బాగా లభిస్తుంది. దీనికి తోడు క్షత్రియ రాజుల మద్దతు కూడా కూటమికి ప్లస్ కానుంది.
కాబట్టి ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని తమ పార్టీ పరిస్థితి ఏఏ స్థానాల్లో జనసేనకు ఎక్కువ స్కోప్ ఉంది, ఏ స్థానాల్లో మిత్రపక్షం టీడీపీకి స్కోప్ ఉంది అనే చర్చలతో పాటు కాకినాడ కేంద్రంగా తాను ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తే అటు పశ్చిమ గోదావరికి,
ఇటు తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో కూడా కూటమికి లాభం చేకూరుతుందని ఆయన భావిస్తున్నారు. అందుకే మూడు రోజుల పాటు అక్కడ మకాం వేయనున్నారు.
ఈ మూడు రోజుల్లో పలువురు ఇతర పార్టీల నుండి జనసేన కండువాలు కప్పుకునే అకాశం ఉంది.