త్రివిక్రమ్ గురించి పూనమ్ వ్యాఖ్యలు: నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం ఎప్పుడొస్తుంది?

0

పూనమ్ కౌర్, సోషల్ మీడియాలో దర్శకుడు త్రివిక్రమ్ మీద నిత్యం ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఆమె పోస్టులు, కామెంట్లతో నెటిజన్లలో చర్చలు ముదురుతున్నాయి. పూనమ్ కౌర్ నేరుగా తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పకపోయినా, పరోక్షంగా త్రివిక్రమ్ మీద తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అయితే, ఇప్పటి వరకు త్రివిక్రమ్ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పూనమ్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

తాజాగా పూనమ్ కౌర్ ట్వీట్ చేస్తూ, త్రివిక్రమ్ తన జీవితాన్ని నాశనం చేశాడని ఆరోపించింది. తాను ఫిల్మ్ అసోసియేషన్‌లో కంప్లైంట్ చేసినప్పటికీ, త్రివిక్రమ్‌ను కనీసం ప్రశ్నించలేదని, అతడిపై చర్యలు తీసుకోలేదని మండిపడింది. తన ఆరోగ్యం, ఆనందం అన్నీ కోల్పోయేలా చేశారని, ఇప్పటికీ అతడిని ప్రోత్సహిస్తూనే ఉన్నారని ఆమె వాపోయింది.

పూనమ్ తన ట్వీట్లలో త్రివిక్రమ్ పేరు నేరుగా ప్రస్తావించడం ఇప్పుడు ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తోంది. గతంలో ఆమె “గురూజీ” అంటూ పరోక్షంగా వ్యాఖ్యానిస్తుండగా, ఇప్పుడు ఆమె ట్వీట్లు మరింత స్పష్టంగా, పేరుతో బయటకు వస్తున్నాయి. అయితే, తనపై జరిగిన అన్యాయం గురించి వివరాలిచ్చే విషయంలో ఆమె నోరు మెదపలేదు. దీంతో నెటిజన్లు కూడా “అసలు మీకు జరిగిన అన్యాయం ఏమిటో చెప్పండి, అప్పుడు మీకు న్యాయం జరుగుతుంది” అంటూ ఆమెను ప్రశ్నిస్తున్నారు.

తాజా ట్వీట్‌లో పూనమ్ కౌర్, పవన్ కళ్యాణ్ చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ మరోసారి స్పందించింది. “నువ్వు ఎవరన్నది కాదు, నువ్వు ఏం చేశావన్నదే ముఖ్యం” అని పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలను, త్రివిక్రమ్ విషయంలో అన్వయించి చెప్పింది.

పూనమ్ కౌర్ చేస్తున్న ఆరోపణలపై త్రివిక్రమ్ ఇప్పటివరకు స్పందించకపోవడం, ఫిల్మ్ అసోసియేషన్ నుండి కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారాయి. పూనమ్ ఈ ఆరోపణలను ఎందుకు చేస్తున్నది, ఆమె చెప్పే మాటల వెనుక అసలు సత్యం ఏమిటనేది ఇంకా బయటపడాల్సి ఉంది.