ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా, సాధారణ జీవితం గడపాలని ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఉంటుంది. రోడ్లపై హాయిగా తిరుగుతూ, షాపింగ్ చేస్తూ, ఇష్టమైన రెస్టారెంట్లలో భోజనం చేస్తూ, కుటుంబంతో జాలీగా గడపాలని అనుకుంటారు. అయితే, టాలీవుడ్‌లో హీరోల పట్ల అభిమానుల ఫాంటసీ మామూలుగా ఉండదు. అభిమానులు తమ ఇష్టమైన హీరోను చూడటానికి ఎక్కడికైనా పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఫలితంగా, మన స్టార్ హీరోలకి పబ్లిక్ లైఫ్ చాలా పరిమితమవుతుంది. కుటుంబంతో కలిసి హ్యాపీగా బయట తిరగడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
ఈ పరిస్థితుల్లో, సెలబ్రిటీలు తమ కుటుంబంతో ప్రశాంతంగా గడపడానికి ఎక్కువగా విదేశాలనే ఆశ్రయిస్తారు. వీకెండ్ పార్టీలు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వంటి వేడుకలు ఇక్కడ చేసుకోవడం కష్టంగా మారిపోతోంది. అందుకే, ఇష్టమైన డెస్టినేషన్ కు వెళ్లి, కుటుంబంతో కలిసి కొత్త సంవత్సరాన్ని ఆహ్లాదకరంగా జరుపుకోవడాన్ని వారు ఇష్టపడుతున్నారు.
ఈ సంవత్సరం న్యూ ఇయర్ వేడుకల కోసం చాలా మంది స్టార్ హీరోలు విదేశాల్లో ప్లాన్ చేసుకున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే ‘వార్ 2’ షూటింగ్ పూర్తి చేసి, తన కుటుంబంతో కలిసి లండన్ వెళ్లే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. లండన్‌లో కొత్త సంవత్సర వేడుకల అనంతరం తిరిగి షూటింగ్‌లో చేరతారని తెలుస్తోంది.
ఇదే తరహాలో, సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి యూరప్, జర్మనీ దేశాల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రాజమౌలి తో మూవీ కోసం ఫుల్ బిజీ గా ఉన్న మహేష్ కొన్ని రోజులు ఫ్యామిలీ తో హాలిడే ట్రిప్ ప్లాన్ చేస్తున్నాడు.అక్కడి మంచు వాతావరణాన్ని ఆస్వాదించడమే కాకుండా, కొద్ది రోజులు కుటుంబంతో కలిసి హాయిగా గడపనున్నారు.
డార్లింగ్ ప్రభాస్ విషయానికి వస్తే, ఇటీవలే గాయంతో ‘ది రాజాసాబ్’ సినిమా షూటింగ్‌కు విరామం తీసుకున్న ప్రభాస్, న్యూ ఇయర్ వేడుకలను విదేశాల్లోనే జరుపుకోవాలని ప్లాన్ చేశారని సమాచారం. అలాగే, టాలీవుడ్‌లోని మరికొందరు స్టార్ హీరోలు కూడా ఈ సీజన్‌కు విదేశీ పర్యటనల షెడ్యూల్‌లు ఫిక్స్ చేసుకున్నారు.
కొత్త సంవత్సర వేడుకల అనంతరం కొంతమంది విశ్రాంతి తీసుకోగా, మరికొందరు కుటుంబంతో సాదారణంగా ఇంట్లోనే వేడుకలు జరుపుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని సమాచారం. అందరి అభిమాన హీరోలు ఈ వేడుకల అనంతరం మరల సినిమాల షూటింగ్స్‌లో పూర్తిగా నిమగ్నమవుతారని సినీ వర్గాలు చెబుతున్నాయి.