
తాజాగా జరిగిన ‘డ్రాగన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత ఎస్ కే ఎన్ చేసిన ఒక వ్యాఖ్య నెట్టింట్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఆయన తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వడం వల్ల ఎదురైన అనుభవాలపై మాట్లాడుతూ ఇకపై తెలుగు హీరోయిన్లకు ఛాన్స్ ఇవ్వకూడదని సరదాగా అన్నారు. అయితే ఈ మాటలు వైరల్ అవడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఎస్సీకేఎన్, దర్శకుడు సాయి రాజేష్‌లకు నటి వైష్ణవి చైతన్యతో ఏదైనా విబేధాలు వచ్చాయేమోననే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ‘బేబీ’ సినిమా తర్వాత మళ్లీ వైష్ణవి చైతన్య వీరితో పనిచేయడానికి ఆసక్తి చూపలేదా? అందుకే ఆగ్రహంతో అలా మాట్లాడారా? అనే ప్రశ్నలు నెటిజన్ల మధ్య చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ వివాదం ఊహించని దిశలో పెరిగిపోవడంతో ఎస్ కే ఎన్ దీనిపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
తాను చేసిన వ్యాఖ్యలను అసలు ఉద్దేశ్యానికి భిన్నంగా తీసుకున్నారని, కేవలం సరదాగా అన్న మాటలను బలపెట్టి వార్తలు రాయడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. తాను తెలుగు మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తినని, ఇప్పటివరకు ఎనిమిది మంది తెలుగు అమ్మాయిలను చిత్రసీమకు పరిచయం చేశానని గుర్తు చేశారు. ఆనంది, రేష్మ, మానస, ప్రియాంక జవాల్కర్, వైష్ణవి చైతన్య, కుషిత, హారికలతో పాటు మరికొందరికి అవకాశాలు కల్పించానని తెలిపారు.
తన ప్రాధాన్యత ఎప్పుడూ తెలుగమ్మాయిలకే అని స్పష్టం చేసిన ఎస్ కే ఎన్, కేవలం హీరోయిన్ పాత్రలకే కాకుండా ఇతర విభాగాల్లో కూడా తెలుగు మహిళలకు అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తానన్నారు. తాను ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది తప్పకుండా తెలుగు టాలెంట్‌కి మేలు చేయడానికే ఉంటుందని అన్నారు.
అయితే ఎంతటి వివరణ ఇచ్చినా, తొలుత అలాంటి వ్యాఖ్యలు అవసరమా? అన్నదానిపై విమర్శలు తగ్గడం లేదు. నిర్మాతగా ఎస్ కే ఎన్ అనేక మంది కొత్త నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కానీ ఒక్కసారిగా ఈ వివాదంలో ఇరికించుకోవడం ఆయన కూడా ఊహించి ఉండకపోవచ్చు. ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందనేది, సాయి రాజేష్‌తో కలిసి ఆయనకు ఏదైనా ఇబ్బంది ఎదురైన సందర్భం ఉందా? అన్నదానిపై ఇప్పటికీ సందేహాలు కొనసాగుతున్నాయి.
నటీనటుల డేట్లు, ప్రాజెక్టులలో కమిట్‌మెంట్‌ల విషయాలు బయటకు రావు. కానీ ఒక ప్రముఖ నిర్మాత ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం పట్ల సినీ ప్రేమికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎస్ కే ఎన్ వివరణ ఇచ్చిన తర్వాత కూడా చర్చ కొనసాగుతోంది. కొంతమంది నెటిజన్లు ఈ వ్యవహారాన్ని పెద్దది చేయాల్సిన పని లేదని భావిస్తుండగా, మరికొందరు అలాంటి కామెంట్లు అవసరమా? అనే ప్రశ్న వేస్తూనే ఉన్నారు.